- పేపర్ షాట్స్ తొలగింపులో కార్మికులకు ఇబ్బందులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: గణేశ్ నిమజ్జనం సందర్భంగా మంగళవారం వెలువడ్డ 8,547 టన్నుల వ్యర్థాలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు. శోభాయాత్ర కొనసాగిన 303 కిలోమీటర్ల పరిధిలో రోడ్ల క్లీనింగ్కొనసాగుతోంది. గురువారం ఉదయం వరకు క్లీనింగ్ చెత్త తొలగింపు కొనసాగుతుందని బల్దియా ఉన్నతాధికారులు చెప్పారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ వ్యర్థాలు వెలువడ్డాయి. ఇందులో పేపర్ ప్లేట్లు, పూజా సామగ్రి, అలంకరణ ఐటమ్స్ఉన్నాయి. చెత్తను తొలగించేందుకు 15 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేశారు. ఉత్సవాలు జరిగిన11 రోజులపాటు సగటున రోజూ 8 వేల టన్నుల చెత్త వెలువడిందని అధికారులు వెల్లడించారు. సాధారణ రోజుల్లో ఐదారు టన్నులకు మించి ఉండదన్నారు.
పేపర్ షాట్స్ వద్దన్నా వినలే
నిమజ్జనం ఊరేగింపులో రోడ్లపై పేపర్ షాట్స్ వాడొద్దని జీహెచ్ఎంసీ అధికారులు ముందుగానే చెప్పినప్పటికీ భక్తులు వినిపించుకోలేదు. కలర్పేపర్ షాట్స్ లో కెమికల్కలిసి ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించినా పట్టించుకోలేదు. దాదాపు ప్రతి వాహనం నుంచి పేపర్ షాట్స్ వదిలారు. దీంతో బుధవారం రోడ్లపై ఎక్కడ చూసినా పేపర్షాట్స్కనిపించాయి. బుధవారం ఉదయం 5 గంటల నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ పై 500 మంది బల్దియా సిబ్బందిని పెట్టి ఊడ్పించారు. చీపురుతో ఊడిస్తే అవి పైకి ఎగురుతుండడం, కొన్ని చోట్ల అతుక్కుపోవడంతో క్లీన్ చేసేందులు కార్మికులు ఇబ్బందులు పడ్డారు. దీంతో సాగర్ పరిసర ప్రాంతాల్లో నాలుగు స్వీపింగ్ మెషీన్లు పెట్టి క్లీన్చేయించాల్సి వచ్చింది. వీటితోపాటు చాలామంది రోడ్లపై ఫుడ్పడేయడంతో బుధవారం రెగ్యులర్పనుల కోసం రోడ్డెక్కిన వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల వాహనాలు స్కిడ్అయ్యాయి.
సాగర్ లో 5,500 మెట్రిక్ టన్నులు
హుస్సేన్ సాగర్లో ఓవైపు నిమజ్జనాలు కొనసాగుతుండగా, మరో వైపు హెచ్ఎండీఏ సిబ్బంది వ్యర్థాలను తొలగించారు. బుధవారం సాయంత్రం వరకు విగ్రహాలకు సంబంధించిన 5,500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించారు. సాగర్ లో మరో 7వేల మెట్రిక్టన్నుల వ్యర్థాలు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. తొలగించిన వ్యర్థాలను లోయర్ ట్యాంక్ బండ్ లోని జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు.