
బెంగళూరు: బెంగళూరు వాసులపై మరో పన్నుభారం పడింది. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి ‘చెత్త’ పన్నును అమలులోకి తెచ్చింది. ‘సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్’ (ఎస్ డబ్ల్యూఎం) ఫీజు పేరుతో చెత్త పన్ను వసూలు చేస్తున్నది. ప్రాపర్టీ ఓనర్లందరూ వేస్ట్ మేనేజ్ మెంట్ ఫీజు కట్టాలని బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) ఆదేశాలు జారీ చేసింది.
నగరంలోని చెత్తను సేకరించి, మరింత మెరుగ్గా డిస్పోజ్ చేసేందుకు పన్నును అమల్లోకి తెచ్చామని బీబీఎంపీ అధికారులు పేర్కొన్నారు. ఈ పన్నుతో బీబీఎంపీకి రూ.685 కోట్ల ఆదాయం సమకూరుతుందని తెలిపారు. సిటీలో వేస్ట్ మేనేజ్ మెంట్ను మరింత సమర్థంగా నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకుందని, అందులో భాగంగానే నగర పౌరుల నుంచి చెత్త పన్ను సేకరించాలని నిర్ణయించిందని ఆఫీసర్లు చెప్పారు.