ఎమ్మెల్యే ఇచ్చే మందు డబ్బులు తీసుకోండి.. ఓటు మాత్రం కాంగ్రెస్ కు వేయండి : ఉత్తమ్​ కుమార్​ రెడ్డి

గరిడేపల్లి, వెలుగు: ఎమ్మెల్యే సైదిరెడ్డి అక్రమంగా సంపాదించిన డబ్బుతో గెలవాలని చూస్తున్నాడని, అది ప్రజల సొమ్మేనని.. వాళ్ళు ఇచ్చే డబ్బులు, మందు తీసుకున్నా.. ఓటు మాత్రం కాంగ్రెస్ కు వేయాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ఆదివారం గరిడేపల్లి మండల కేంద్రంలో ఎంపీపీ పెండెం సుజాత, మాజీ జడ్పీటీసీ పెండెం శ్రీనివాస్ గౌడ్ , బీఆర్ఎస్ నుంచి పలు గ్రామాల సర్పంచులు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోపిడీ చేసిన బీఆర్ఎస్ ను తరిమికొట్టే రోజులు వచ్చాయన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ లు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు లక్షల ఇళ్లు కట్టించానని ఎమ్మెల్యే సైదిరెడ్డి మాత్రం ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. తాను మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏనాడు పోలీస్ స్టేషన్ ను వాడుకోలేదని, ఎమ్మెల్యే సైదిరెడ్డి మాత్రం పోలీస్ స్టేషన్ ల వెనుక దాక్కుని రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు.

పార్టీలో చేరిన వారిలో గారకుంట తండ సర్పంచ్ బాబు నాయక్, లక్ష్యా తండ సర్పంచ్ బాబు నాయక్, రేగులగడ్డ తండా సర్పంచ్ బానోతు ఉషా వెంకటేశ్వర్లు, వెలిదండ ఉప సర్పంచ్ జగన్, దశరదు, దేవదానం తదితరులు ఉన్నారు.