
- చాట్లపల్లిలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర
జగదేవపూర్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఐఏఎస్ అజయ్ గుప్తా, సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం చాట్లపల్లిలో శనివారం స్టేట్బ్యాంక్ఆఫ్ఇండియా, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ ప్రోగ్రామ్నిర్వహించారు.
అజయ్గుప్తా, గరిమా అగర్వాల్ పాల్గొని వివిధ శాఖల అధికారులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా మంజూరైన గ్యాస్ కనెక్షన్లను, మండల సమాఖ్యకు రూ. 2 కోట్ల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రం అందిస్తున్న సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కేంద్ర పథకాలు అందుతున్నాయో? లేదో సంకల్ప యాత్ర ద్వారా తెలుసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రతిరోజూ 14 గ్రామ పంచాయతీల పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏపీడీ జయదేవ్, డీఏఓ శివప్రసాద్, డీఎంహెచ్ఓ కాశీనాథ్, సర్పంచ్ రాచర్ల నరేశ్, ఎంపీపీ బాలేశం గౌడ్, ఎంపీటీసీ కావ్య, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ, ఏఓ వసంతరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.