
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో దాదాపు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చుంచుపల్లి మండలం గరిమెళ్లపాడులో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సుజాతనగర్లో 44.7 డిగ్రీలు, కొత్తగూడెం, జూలూరుపాడు, చర్ల మండలంలోని సత్యనారాయణపురంలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాగా ఎండలు రోజు రోజుకు మండుతున్న క్రమంలో ఏ రోజుకారోజు ఉష్ణోగ్రతలను ప్రజలకు తెలపాల్సిన అధికారులు వివరాలను వెల్లడించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. దీనిపై కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.