మానేరుపై బ్రిడ్జి మరిచిన్రు ..ఎనిమిదేళ్లయినా సగం కూడా పూర్తి కాని పనులు

  • రూ. 47 కోట్లతో 2016లో పనులు ప్రారంభం
  • వానాకాలంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
  • బ్రిడ్జి పూర్తయితే రెండు జిల్లాల మధ్య తగ్గనున్న 80 కిలోమీటర్ల దూరం

జయశంకర్‌‌ భూపాలపల్లి/చిట్యాల, వెలుగు: రెండు జిల్లాల ప్రజలకు ఉపయోగపడే బ్రిడ్జి నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా ముందుకు సాగడం లేదు. భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి – పెద్దపల్లి జిల్లా ఓడేడు గ్రామాల మధ్య ఎనిమిదేళ్ల కింద ప్రారంభించిన హైలెవల్‌‌ బ్రిడ్జి పనులు పాలకుల పట్టింపులేని తనం, ఆఫీసర్ల అలసత్వం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఇప్పటివరకు 50 శాతం కూడా పూర్తి కాలేదు. ప్రస్తుతం వాగులో నీళ్లు లేకపోవడంతో ప్రజలు మట్టి రోడ్డుపై రాకపోకలు సాగిస్తున్నారు. వానాకాలంలో వాగు పారితే ఈ రోడ్డు కూడా అందుబాటులో ఉండదు. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2016లోనే రూ.47 కోట్లతో పనులు స్టార్ట్‌‌‌‌  

భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల మధ్య నుంచి మానేరు వాగు పారుతోంది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని వరంగల్, పరకాల, చిట్యాల, జమ్మికుంట, మొగులపల్లి, పెద్దపల్లి, మంథని, గోదావరిఖని, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి ప్రాంతాలకు చెందిన ప్రజలు నిత్యం ఈ మార్గం గుండానే రాకపోకలు సాగిస్తుంటారు. వాగు పారే టైంలో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుండడంతో హై లెవెల్‌‌ బ్రిడ్జి నిర్మించాలని రెండు జిల్లాల ప్రజలు అనేక పోరాటాలు చేశారు. దీంతో స్పందించిన సర్కార్‌‌ భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి – పెద్దపల్లి జిల్లా ఓడేడు గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మించేందుకు నిర్ణయించింది. ఇందుకోసం రూ. 47.40 కోట్లు కేటాయించడంతో 2016 లో అప్పటి స్పీకర్, ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, ఆర్‌‌అండ్‌‌బీ మినిస్టర్‌‌ తుమ్మల నాగేశ్వరరావు బ్రిడ్జి నిర్మాణ పనులను స్టార్ట్‌‌‌‌ చేశారు. సాయి కన్‌‌స్ట్రక్షన్‌‌ కార్పొరేషన్‌‌ అనే కంపెనీ టెండర్‌‌‌‌ దక్కించుకుంది. రెండేళ్లలో బ్రిడ్జి పూర్తి చేయాలని టార్గెట్‌‌గా పెట్టుకున్నారు. ఎనిమిదేళ్లు అవుతున్నా పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదు.

80 కిలోమీటర్లు తగ్గనున్న దూరం

మానేరు వాగులో నీరు ప్రవహించే టైంలో భూపాలపల్లి, కొయ్యూరు, మంథని మార్గం గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. దీంతో 80 కిలోమీటర్లు అదనంగా తిరగాల్సి వస్తోంది. బ్రిడ్జి పూర్తయితే దూరభారం తగ్గడంతో పాటు ప్రజలకు టైం, డబ్బు ఆదా కానుంది. ఓడేడు గ్రామ రైతులకు, గీతా కార్మికులకు వాగు అవతల ఉన్న గర్మిళ్లపల్లి శివారులో వ్యవసాయ భూములు, తాటివనం ఉన్నాయి. ప్రస్తుతం వాగులో నీరు లేకపోవడంతో గర్మిళ్లపల్లి, ఓడేడు గ్రామాల ఉమ్మడి కమిటీ ఆధ్వర్యంలో తాత్కాలికంగా మట్టి రోడ్డు నిర్మించి రాకపోకలు సాగిస్తున్నారు. కానీ వర్షాకాలంలో వాగు దాటాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వాగు దాటుతూ మనుషులు, పశువులు కొట్టుకుపోయిన ఘటనలు కూడా ఉన్నాయి.

కొట్టుకుపోయిన సిమెంట్‌‌‌‌ గడ్డర్లు

మానేరు వాగుపై 23 పిల్లర్లతో సుమారు కిలోమీటరు పొడవున బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్‌‌ సంస్థ నుంచి ఇద్దరు సబ్‌‌ కాంట్రాక్టర్ల చేతుల్లోకి మారాయి. వాగుకు అటు, ఇటు పిల్లర్లు నిర్మించి మధ్యలో వదిలేశారు. ఎనిమిదేళ్లు దాటినా ఇప్పటి వరకు 50 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. మిగిలిన పనులు ఎప్పుడు పూర్తవుతాయో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఆఫీసర్లు ఎవరూ పట్టించుకోకపోవడంతో కాంట్రాక్ట్‌‌ సంస్థ పనులను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయింది. గతేడాది వచ్చిన వరదలకు సిమెంట్‌‌‌‌ గడ్డర్లు నీటిలో కొట్టుకుపోయాయి. కాంట్రాక్ట్‌‌ సంస్థ ప్రతినిధులకు, ఓ మంత్రికి మధ్య సంబంధాలు ఉండడం వల్లే ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది.

నెల రోజుల్లో స్టార్ట్‌‌‌‌ చేస్తాం

నెల రోజుల్లో బ్రిడ్జి నిర్మాణ పనులు స్టార్ట్‌‌ చేస్తాం. ప్రణాళిక లోపం, నిర్లక్ష్యం కారణంగా జాప్యం జరిగింది వాస్తవమే. భారీ వర్షాలు, వరదలు కూడా పనులకు ఇబ్బందులు కలిగించాయి. పాత అగ్రిమెంట్ ప్రకారమే అదే కాంట్రాక్ట్‌‌‌‌ సంస్థతో పనులు పూర్తి చేస్తాం.
‒ నరసింహచారి, ఆర్‌‌అండ్‌‌బీ ఈఈ, పెద్దపల్లి

వాగులో కొట్టుకుపోతున్రు 

మానేరు వాగు అవతల వ్యవసాయ భూములు ఉన్నాయి. యాసంగి, వానాకాలం రెండు పంటలు సాగు చేస్తం. గతంలో వానాకాలంలో వాగు దాటుతూ మనుషులు, పశువులు గల్లంతయ్యారు. వంతెన నిర్మాణం ప్రారంభం కావడంతో మా కష్టాలు తీరుతాయని అనుకున్నాం. కానీ ఎనిమిదేళ్లయినా పనులు పూర్తి చేయడం లేదు. బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలి. 
- ఓరుగంటి వెంకటరెడ్డి, ఓడేడు, పెద్దపల్లి