- మరోసారి నేచురల్ గ్యాస్ సప్లయ్ తగ్గించిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: ప్రభుత్వం సప్లయ్ తగ్గించడంతో ఇంద్రప్రస్థా గ్యాస్ లిమిటెడ్ (ఐజీఎల్) , అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ వంటి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు సీఎన్‌జీ ధరలు పెంచాలని ప్లాన్ చేస్తున్నాయి. పాత ఆయిల్ ఫీల్డ్స్ నుంచి సిటీ గ్యాస్ రిటైలర్లకు చేసే నేచురల్ గ్యాస్ సప్లయ్‌ను ప్రభుత్వం నెలలో రెండోసారి తగ్గించింది. నవంబర్ 16 నుంచి నేచురల్ గ్యాస్ సప్లయ్‌లో 20 శాతం కోత పడింది. కిందటి నెల 16 న గ్యాస్ సప్లయ్‌లో 21 శాతం కోత విధించిన విషయం తెలిసిందే. ఐజీఎల్ ఢిల్లీ, చుట్టుపక్కల సిటీలలో సీఎన్‌జీ సప్లయ్ చేస్తోంది.
మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (ఎంజీఎల్) ముంబైలో, అదానీ టోటల్ గ్యాస్ గుజరాత్‌లో ఆపరేట్ చేస్తున్నాయి. సప్లయ్ తగ్గడంతో ప్రాఫిట్స్‌పై ప్రభావం పడుతుందని తమ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ కంపెనీలు పేర్కొన్నాయి. సీఎన్‌జీ రేట్లు పెంచుతామనే సంకేతాలు ఇచ్చాయి. కానీ, ఈ కంపెనీలు ఇప్పటికే ఎక్కువ మార్జిన్స్ పొందుతున్నాయని, నేచురల్ గ్యాస్‌ను దిగుమతి చేసుకున్నా అదనంగా అయ్యే ఖర్చును ఈజీగా తట్టుకోగలవని, రేట్లు పెంచాల్సిన అవసరం లేదని పెట్రోలియం మినిస్ట్రీ అధికారులు భావిస్తున్నారు. ‘ఉదాహరణకు ఐజీఎల్ 2023–24 లో రూ.16 వేల కోట్ల రెవెన్యూపై రూ.1,748 కోట్ల ప్రాఫిట్ సాధించింది.
ఇది 11 శాతం మార్జిన్. ఎంజీఎల్ రూ.7 వేల కోట్ల రెవెన్యూపై రూ.1,300 కోట్ల ప్రాఫిట్ పొందింది. ఏ రిటైలర్ ఇంతలా మార్జిన్స్ పొందుతారు? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా రూ.8.71 లక్షల కోట్ల రెవెన్యూపై రూ.39,617 కోట్ల ప్రాఫిట్ సాధించినప్పుడు 4.5 శాతం మార్జిన్ పొందింది’ అని సీనియర్ అధికారులు పేర్కొన్నారు. చౌక నేచురల్ గ్యాస్ కావాలంటే ఫైనల్ ప్రొడక్ట్ (సీఎన్‌జీ) ఉత్పత్తికి అయ్యే ఖర్చును కంపెనీలు బయటపెట్టాలని అన్నారు.