
- ‘వీ6 వెలుగు’ ఇంటర్వ్యూలో పద్మ విభూషణ్ గ్రహీత డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ప్రకృతి నుంచి వచ్చే పండ్లు, కూరగాయలను అలాగే తినాలని, వాటిని జ్యూస్ లు తీసి తాగడం మంచిది కాదని ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, ఏసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) వ్యవస్థాపకుడు డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి చెప్పారు. ప్రతి ఒక్కరూ లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు మార్చుకుంటేనే హెల్దీ లైఫ్ ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ సమాన వైద్యం అందడంలేదని, అందరికీ ఉచిత వైద్యం కూడా సాధ్యం కావట్లేదన్నారు. అందుకే ప్రతి ఒక్కరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం పెరిగిందన్నారు. ప్రభుత్వాలే ప్రజలకు ప్రీహెల్త్ చెకప్ లు చేసేందుకు కొత్త స్కీంలు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఎంతో మంది సెలబ్రిటీలకు ట్రీట్మెంట్ చేసినందుకు తనను సెలబ్రిటీల డాక్టర్ అంటుంటారని.. కానీ తాను ఎప్పుడూ సామాన్య ప్రజల డాక్టర్నే అని స్పష్టం చేశారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మ విభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో ఆయనతో ‘వీ6 వెలుగు’ ప్రతినిధి ముచ్చటించారు. వైద్య రంగంలో ప్రస్తుత పరిస్థితులు, ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తల వంటి అనేక అంశాలను ఆయన ఈ ఇంటర్వ్యూలో వివరించారు.
వీ6 వెలుగు: దేశంలో మూడు పద్మ అవార్డులు అందుకున్న తొలి డాక్టర్‌గా మీకు అరుదైన గుర్తింపు దక్కడం ఎలా అనిపిస్తోంది?
నాగేశ్వర్ రెడ్డి: కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. నాకు 2002లో పద్మశ్రీ, 2016లో పద్మ భూషణ్.. ఇప్పుడు పద్మ విభూషణ్ వచ్చింది. అయితే, ఈ అవార్డులు మా ఏసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) డాక్టర్లు, సిబ్బంది అందరికీ దక్కిన గుర్తింపుగా భావిస్తున్నా. పద్మ విభూషణ్‌తో నా బాధ్యత మరింతగా పెరిగింది. ఈ అవార్డు గౌరవానికి తగ్గట్టుగా సేవలు అందించాల్సిన బాధ్యత నాతోపాటు మా ఇనిస్టిట్యూషన్‌కు కూడా పెరిగింది.
Also Read :- డిజిట్ ఇన్సూరెన్స్ నుంచి కొత్త టర్మ్ పాలసీ
నాగేశ్వర్ రెడ్డి అనగానే సెలబ్రిటీల డాక్టర్ అని,ఏఐజీ సంస్థ కార్పొరేట్ హాస్పిటల్ అని అనడం పట్ల మీ స్పందన ఏంటీ?
నేను ఎప్పటికైనా ప్రజల డాక్టర్నే. ఎందుకంటే మేం స్టార్ట్ అయినప్పుడు వెంటనే సెలబ్రిటీలు ఏం రాలేదు కదా. సుమారు 40 ఏండ్ల కిందట నేను ప్రాక్టీస్ మొదలుపెట్టాను. మొదట్లో సాధారణ ప్రజలే వచ్చారు. వాళ్లే మమ్మల్ని విశ్వసించారు. వారి వల్లే గుర్తింపు వచ్చింది. గుర్తింపు వచ్చిన తర్వాత సెలబ్రిటీలు కూడా రావడం మొదలుపెట్టారు. కానీ ఎప్పటికైనా సామాన్య ప్రజలకు సేవ చేయడంలోనే నాకు ఎక్కువ సంతృప్తి లభిస్తుంది. అలాగే ఏఐజీ అనగానే కార్పొరేట్ హాస్పిటల్ అనడం కూడా సరికాదు. ఏఐజీకి మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వంటివాళ్లు అందరూ వస్తుంటారు. మా పేషెంట్లలో వీళ్లే 70 శాతం ఉంటారు. అందుకే మా ఇనిస్టిట్యూట్ సామాన్యుడిని రిప్రజెంటేట్ చేస్తుందని భావిస్తున్నా.
గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందాలంటే ఏం చేయాలి?
హెల్త్ సైన్సెస్ లో నలబై ఏండ్లుగా చాలా ఆధునిక టెక్నాలజీలు వచ్చాయి. ఇప్పుడు అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో అందుబాటులో ఉన్న వైద్య చికిత్సలు ఇక్కడ కూడా చేస్తున్నాం. కానీ వైద్య రంగం ఇంతగా డెవలప్ అయినా.. అందరికీ సమాన వైద్యం అందడంలేదు. ప్రస్తుతం మన వ్యవస్థే అలా ఉంది. గ్రామాల్లో ఇంత అధునాతన చికిత్సలు అందించడం కూడా చాలా కష్టం. మెరుగైన వైద్య చికిత్సలపై ఊర్లల్లో ప్రజలకు కూడా సరైన అవగాహన ఉండటంలేదు. దీని పరిష్కారానికి గవర్నమెంట్, డాక్టర్లు అంతా కలిసి కృషి చేయాలి. మేం పటాన్ చెరు ప్రాంతంలోని వంద గ్రామాలను దత్తత తీసుకున్నాం. వారికి కంప్లీట్ గా ఫ్రీ సర్వీస్ అందిస్తున్నాం. 70 శాతం వరకూ చికిత్సలు ఉచితంగా కవర్ చేస్తున్నాం. మేజర్ సర్జరీలు ఉంటేనే డబ్బులు అవసరం అవుతుంది. అవి కూడా డోనర్స్ సాయంతో చారిటీ విధానంలో చేస్తున్నాం.
విద్య, వైద్యంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టినా మంచి ఫలితాలు ఎందుకు రావడంలేదు?
ప్రపంచంలో ఎక్కడైనా విద్య, వైద్యం అందించడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. వీటిలో ఎడ్యుకేషన్ ఈజీ. కానీ వైద్యం అనేది క్లిష్టమైన అంశం. వైద్యరంగంలో ఎప్పటికప్పుడు వేగంగా మా ర్పులు, కొత్త టెక్నాలజీలు వస్తుంటాయి. దీనికి క్వాలిఫైడ్ డాక్టర్లు, అన్ని రకాల సౌలతులు కావాలి. అయితే, ఈ విషయంలో మనం కొంతవరకు మెరుగ్గానే ఉన్నాం.
వైద్య చికిత్సల కోసం లక్షలకు లక్షలు ధార పోయాల్సి వస్తోంది. ఒక సామాన్యుడికి ఉచితంగా వైద్యం అందుతున్న భరోసా ఉండాలి కదా?
ఊర్లల్లో చాలా మంది ఇండ్లు, పొలాలు సైతం అమ్ముకుని ట్రీట్మెంట్ కు వస్తుంటారు. అలాంటివి చూసినప్పుడు చాలా బాధనిపిస్తుంది. ఇప్పుడు వైద్యం అనేది కాస్ట్ లీ అంశం అయింది. మందులు, పరికరాలు, డాక్టర్ల సేవలు ఇలా అన్నింటినీ ఫ్రీగా ఇవ్వడం సాధ్యం కాదు. దీనివల్ల వైద్యం ఖర్చు పెరుగుతుంది. ఆ ఖర్చును ఎక్కువ మంది భరించలేరు. ఉచిత వైద్యం అనేది చివరకు చైనా, రష్యా వంటి కమ్యూనిస్టు దేశాల్లో కూడా లేదు. ప్రభుత్వం అన్నీ ఉచితంగా చేయాలంటే అందుకు కావల్సిన డబ్బును తిరిగి జనాల నుంచే ట్యాక్స్ రూపంలో వసూలు చేయాలి. అందుకే ఈ సమస్యకు హెల్త్ ఇన్సూరెన్స్ ఒక్కటే పరిష్కారం.
హెల్దీ లైఫ్ కోసం ప్రజలకు మీరిచ్చే సూచనలు ఏమిటి?
‘‘నాన్ వెజ్ తక్కువగా, వెజ్ ఎక్కువగా తినాలి. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్, చిప్స్ వంటి జంక్ ఫుడ్ మానేయాలి. వీటితోపాటు ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. మరోవైపు సెలబ్రిటీలు చిప్స్, ఇతర జంక్ ఫుడ్ ప్రకటనలు చేయకూడదు. వీటిని సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం వల్ల పిల్లలు ఆకర్షితులవుతున్నారు. ఇక ప్రొటీన్లు రోజుకు ప్రతి మనిషికి ఒక కిలో బరువుకు ఒక గ్రాము అవసరం. అంటే 60 కిలోల వ్యక్తికి 60 గ్రాములు చాలు. పిండిపదార్థాల్లో రైస్, బ్రెడ్, షుగర్ వంటివి మంచివికాదు. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండే మిల్లెట్స్ మంచివి. ఫ్యాట్ లో కూడా మంచివి, చెడువి ఉంటాయి. మళ్లీ మళ్లీ వేడి చేసే నూనెలతో చేసిన ఆహారం కూడా తినొద్దు’’
వీ6 వెలుగు: దక్షిణ భారత్ లో ముఖ్యంగా తెలంగాణలో డయాబెటిక్, గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. కారణాలేంటి?
నాగేశ్వర్ రెడ్డి: భారతీయుల్లో ప్రధానంగా డయాబెటిక్ సమస్య వచ్చేందుకు జన్యుపరమైన కారణాలు ఎక్కువగా ఉన్నాయి. మనవాళ్లలో ఎక్కువగా ట్రంకల్ ఒబెసిటీ సమస్య వస్తోంది. అందుకే మంచి ఫుడ్, వ్యాయామంతో ఫిజికల్ హెల్త్ ను కాపాడుకుంటే సమస్యను బాగా తగ్గించవచ్చు. ఫుడ్ లో ప్రధానంగా కార్బొహైడ్రేట్స్ తగ్గించి, మిల్లెట్స్, వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకుంటే మేలు జరుగుతుంది.