బీటెక్ చదివే ప్రతి విద్యార్థి లక్ష్యంగా చేసుకొనే ప్రతిష్టాత్మక పరీక్ష గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్. ఈ స్కోర్ ఆధారంగా దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో ఎంటెక్‌తోపాటు, ప్రభుత్వరంగ సంస్థల్లో కొలువులకు సైతం పోటీ పడొచ్చు. ప్రతి ఏటా లక్షల మంది ఈ పరీక్షకు హాజరవుతుంటారు. ఇంతటి పోటీ, ప్రాధాన్యం సంతరించుకున్న గేట్–2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. గేట్‌తో ప్రయోజనాలు, ఎగ్జామ్ ప్యాటర్న్, విజయానికి అనుసరించాల్సిన వ్యూహాల గురించి తెలుసుకుందాం..
ఈ సంవత్సరం గేట్‌ను ఐఐటీ- కాన్పూర్ నిర్వహిస్తోంది. ఈ స్కోరు పీజీ ప్రవేశానికి మూడు సంవత్సరాలు, పీఎస్‌యూలకు ఒకటి లేదా రెండు సంవత్సరాలు చెల్లుబాటులో ఉంటుంది. గేట్-2024ను రెండు పేపర్లలో రాసే అవకాశం ఉంది. విద్యార్థులు తప్పకుండా రెండు పేపర్లలో పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. తమ ఇష్టప్రకారం ఒకటి లేదా రెండు పేపర్లు ఎంచుకోవచ్చు.
ఎగ్జామ్ ప్యాటర్న్: పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఆన్‌లైన్ పరీక్ష విధానంలో కంప్యూటర్ మౌస్ ఉపయోగించి సరైన సమాధానం గుర్తించాలి. ప్రశ్నపత్రం పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో మూడు రకాలుగా ప్రశ్నలు అడుగుతారు. గేట్ ప్రశ్నపత్రంలో మొత్తం 100 మార్కులకుగాను 65 ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు కేటాయించారు.
విభాగం-1 (జనరల్ ఆప్టిట్యూడ్) : ఇందులో పది ప్రశ్నలుంటాయి. ఐదు ఒక మార్కు ప్రశ్నలు, మరో ఐదు రెండు మార్కుల ప్రశ్నలు. ఈ విభాగంలోని నాలుగు నుంచి ఐదు ప్రశ్నలు ఇంగ్లీష్ సంబంధిత (వెర్బల్ ఎబిలిటీ), మిగతా ప్రశ్నలు క్వాంటిటేటివ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఇవ్వొచ్చు.
విభాగం-2 (ఇంజినీరింగ్ సబ్జెక్టు) : ఈ విభాగంలో 55 ప్రశ్నలుంటాయి. ఇందులో 25 ఒక మార్కు ప్రశ్నలు, 30 రెండు మార్కుల ప్రశ్నలుంటాయి. గణితం నుంచి 10 -నుంచి 15 మార్కులు ఉంటాయి. అయితే ఈ విభాగంలోని ప్రశ్నలు శుద్ధ గణితంలా ఉండవు. ఇంజినీరింగ్ అప్లికేషన్‌తో ఉంటాయి. ప్రశ్నలు ఆయా రంగాల్లోని నూతన ఆవిష్కరణలను దృష్టిలో పెట్టుకుని ఉంటాయి.
కో-ఆర్డినేషన్ అప్రోచ్ : గేట్ అభ్యర్థులు కో–ఆర్డినేషన్ అప్రోచ్‌ను అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా సిలబస్‌ను పూర్తిగా పరిశీలించి.. ఒక స్పష్టత ఏర్పరచుకోవాలి. ఆ తర్వాత గేట్ సిలబస్‌ను అకడమిక్ అంశాలతో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారానికి ప్రిపరేషన్ పూర్తి చేసుకునేలా టైమ్ ప్లాన్ రూపొందించుకోవాలి. ఆ తర్వాత ఉన్న వ్యవధిలో ఆన్‌లైన్ మోడల్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లకు హాజరయ్యే విధంగా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఇలా ఇప్పటి నుంచే నిర్దిష్ట ప్రణాళికతో అడుగులు వేస్తే పరీక్షలో మంచి స్కోర్ సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.
ప్రిపరేషన్ ప్లాన్
గేట్ ఎగ్జామ్ -2024 ఫిబ్రవరిలో ఉంటుంది. పరీక్ష సమయానికి ముందుగానే సన్నద్ధత మొదలుపెట్టడం వల్ల ప్రామాణిక పుస్తకాలు, సంబంధిత మెటీరియల్‌ను సమకూర్చుకోవచ్చు. సిలబస్‌లో ఉన్న కాన్సెప్ట్స్, విషయాలను బాగా సాధన చేసుకోవచ్చు. ఇది గేట్ విజయ సాధనలో ముఖ్య ఘట్టం. సిలబస్‌ను క్షుణ్ణంగా పరిశీలించడం వల్ల ఏ సబ్జెక్టుల్లో ఏయే అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలో అవగతం అవుతుంది. దీంతోపాటు పరీక్ష విధానాన్ని అర్థం చేసుకోవడమూ ముఖ్యమే. దీనివల్ల పరీక్షలోని విభాగాలపై, ప్రశ్నల సాధనపై స్పష్టత వస్తుంది. గత గేట్ ప్రశ్నపత్రాలను తప్పనిసరిగా సాధన చేయాలి. దీంతో ఏ అంశాలపై ఏ కాన్సెప్ట్‌కు ఎటువంటి ప్రాధాన్యం ఇచ్చారో అర్థమవుతుంది. వేటిపై ఎక్కువ దృష్టి పెట్టాలో తెలుస్తుంది.
అన్ని సబ్జెక్టులకూ, అన్ని అంశాలకూ గేట్‌లో ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి సన్నద్ధతలో అన్ని సబ్జెక్టులకూ ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి సబ్జెక్టు, ప్రతి చాప్టర్‌కు సంబంధించిన అంశాలపై చిన్నచిన్న పట్టికలను తయారు చేసుకోవాలి. ప్రతి చాప్టర్, సబ్జెక్టు చదివిన తర్వాత దానికి సంబంధించి ప్రముఖ విద్యాసంస్థలు అందించే ఆన్‌లైన్ టెస్టులను రాయాలి. ప్రిపరేషన్ పూర్తయితే మాదిరి ప్రశ్నపత్రాలను (మాక్ టెస్టులు) రాయాలి. దీనివల్ల సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.
చాప్టర్లు, సబ్జెక్టులవారీ మాక్ టెస్టులు, నమూనా ప్రశ్నపత్రాల సాధనలో తప్పుగా రాసిన ప్రతి సమాధానాన్ని సవరించుకుని వాటిపై ప్రత్యేక శ్రద్ధతో సాధన చేయాలి. ఈ తరహా కసరత్తుతో పరీక్ష సమయంలో ఆ తప్పులు పునరావృతం కాకుండా ఉంటాయి. గత సంవత్సరపు ప్రశ్నపత్రాల్లో ఒక ప్రశ్నపత్రాన్ని పరీక్షకు కేటాయించిన సమయంలో రాయడానికి ప్రయత్నిస్తే అభ్యర్థులకు తాము ఏ స్థాయిలో ఉన్నారో అర్థమవుతుంది.
నోటిఫికేషన్
అర్హతలు : ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, హ్యుమానిటీస్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి లేదు.
ఎగ్జామ్ ప్యాటర్న్ : అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్షలో వచ్చిన స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది. 30 సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు 1 లేదా 2 పేపర్లను ఎంపికచేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, మల్టిపుల్ సెలెక్ట్ ప్రశ్నలు, న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. 1, 2 మార్కుల ప్రశ్నలుంటాయి. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది.
దరఖాస్తులు : ఆన్‌లైన్‌లో ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 29 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో నిర్వహిస్తారు. ఫలితాలు మార్చి 16న విడుదల చేస్తారు. పూర్తి వివరాలకు www.gate2024.iisc.ac.in వెబ్సైట్లో సంప్రదించాలి.
పీఎస్‌యూలకు ఛాన్స్
గేట్ స్కోర్‌తో దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు ఎంట్రీ లెవల్ నియామకాలను చేపడుతున్నాయి.ఇవి కూడా గేట్ స్కోర్ ఆధారంగా దరఖాస్తులు ఆహ్వానించి.. నిర్దిష్ట కటాఫ్‌ను నిర్ణయించి మెరిట్ జాబితా రూపొందిస్తున్నాయి. ఆ జాబితాలో నిలిచిన వారికి.. మలిదశ ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, గ్రూప్ పర్సనల్ టాస్క్ వంటి టెస్ట్‌లను నిర్వహిస్తున్నాయి.
వీటిలో విజయం సాధించిన వారికి చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి కొలువులు ఖరారు చేస్తున్నాయి. ఫైనల్ మెరిట్ జాబితా రూపకల్పనలో వెయిటేజీ విధానాన్ని అనుసరిస్తున్నాయి. గేట్ స్కోర్‌కు 70 శాతం, మలిదశ ఎంపిక ప్రక్రియలకు 30 శాతం వెయిటేజిని కల్పిస్తున్నాయి.
బేసిక్స్‌పై పట్టుండాలి : గేట్‌లో మంచి స్కోర్ సాధించి ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే.. తాము ఎంచుకున్న సబ్జెక్ట్‌లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్‌డ్ టెక్నిక్స్ వరకూ.. అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. ప్రతి టాపిక్‌ను చదివేటప్పుడు అందులోని ప్రశ్నార్హమైన అంశాలను గుర్తించి.. దానికి సంబంధించి ప్రాథమిక భావనలపై పట్టు సాధించాలి. ఒక టాపిక్ నుంచి ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో తెలుసుకోవాలి. ఆ మేరకు సాధన చేయాలి. దీంతో పరీక్షలో ప్రశ్నను ఎలా అడిగినా.. సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది.