
ఐఐటీ, ఎన్‌ఐటీ, ఇతర ఇంజినీరింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో అడ్మిషన్స్‌కు గేట్ తొలి మెట్టు. ఆ స్కోర్‌తో ప్రభుత్వ రంగ సంస్థల్లో కొలువులు సైతం సొంతం చేసుకోవచ్చు. అందుకే ప్రతి ఏటా గేట్‌కు అప్లై చేసుకునే అభ్యర్థుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. తాజాగా గేట్–2022 నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జామ్ ప్యాటర్న్, ప్రిపరేషన్ ప్లాన్ ఈ వారం. ..
వెలుగు, ఎడ్యుకేషన్ డెస్క్ : గేట్ ( గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ )– 2022లో కొత్తగా నావల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజినీరింగ్, జియోమాటిక్స్ ఇంజినీరింగ్ అనే రెండు సబ్జెక్టులను చేర్చారు. దీంతో మొత్తం సబ్జెక్ట్ పేపర్ల సంఖ్య 29 కి చేరింది. వీటిలో ఒకటి లేదా రెండు పేపర్లకు హాజరయ్యే అవకాశం అభ్యర్థులకు ఉంది.
అర్హత: ఇంజినీరింగ్/ టెక్నాలజీ/ ఆర్కిటెక్చర్/ కామర్స్/ సైన్స్/ ఆర్ట్స్ విభాగాల్లో.. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆయా కోర్సుల ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థులు సైతం దరఖాస్తుకు అర్హులు.
ఎగ్జామ్ ప్యాటర్న్: గేట్ పరీక్ష ఆన్‌లైన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో 3 గంటల వ్యవధిలో జరుగుతుంది. మొత్తం 65 ప్రశ్నలు–100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. రెండు విభాగాలుగా జరిగే గేట్‌లో.. పార్ట్–ఏ జనరల్ ఆప్టిట్యూడ్. ఈ విభాగం 15 మార్కులకు ఉంటుంది. ఇందులో ఒక మార్కు ప్రశ్నలు అయిదు, రెండు మార్కుల ప్రశ్నలు అయిదు ఉంటాయి. పార్ట్–బీ అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్‌పై ఉంటుంది. ఈ విభాగంలో మొత్తం 55 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 25 ప్రశ్నలు ఒక మార్కు, 30 ప్రశ్నలు రెండు మార్కులకు ఉంటాయి.
పీఎస్‌యూల్లో జాబ్ సాధించాలంటే...
గేట్ స్కోర్ ఆధారంగా ఎంట్రీ లెవల్ నియామకాలను చేపడుతున్న ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు), మలి దశలో రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్స్ నిర్వహిస్తున్నాయి. వీటిలో విజయం సాధించిన వారికి చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. గేట్ స్కోర్‌కు 70 శాతం, మలి దశ ఎంపిక ప్రక్రియకు 30 శాతం వెయిటేజీ ఇస్తున్నారు.
ఎగ్జామ్ సెంటర్స్: విజయవాడ, అనంతపురం, కర్నూలు, ఏలూరు, కాకినాడ, మచిలీపట్నం, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం,విశాఖపట్నం, చీరాల, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కడప, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, వరంగల్.
క్వశ్చన్స్ స్టైల్
గేట్ ఎగ్జామ్‌లో మూడు రకాల ప్రశ్నలు అడుగుతారు. మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్‌గా పేర్కొనే ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు. రెండో రకం మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్(ఎంఎస్‌క్యూ). మూడో విధానంలో న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు. ఎంసీక్యూ ప్రశ్నల విధానంలో.. నాలుగు లేదా అయిదు ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్‌ను సరైన సమాధానంగా గుర్తించాలి.
మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్‌లో.. ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లు సరైన సమాధానాలుగా ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే.. అభ్యర్థులకు సంబంధిత అంశంపై సమగ్రమైన అవగాహన ఉండాలి. న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు కొంత కాలిక్యులేషన్స్‌తో కూడినవిగా ఉంటాయి. వీటికి వర్చువల్ కీ ప్యాడ్ ద్వారా సమాధానం టైప్ చేయాలి.
టైమ్ మేనేజ్మెంట్
గేట్‌లో సక్సెస్ అవ్వాలంటే టైమ్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. విద్యార్థులు రోజుకు కనీసం ఐదారు గంటలు ప్రిపరేషన్‌కు సమయం కేటాయించేలా ప్లాన్ చేసుకోవాలి. గేట్ ఎగ్జామ్ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది కావున విద్యార్థులు ఇప్పటి నుంచే ఆన్‌లైన్ పరీక్ష పై అవేర్నెస్ పెంచుకోవాలి. వర్చువల్ కాలిక్యులేటర్ వినియోగం తెలుసుకోవాలి. ఇందుకోసం వీలైతే ఆన్‌లైన్ మోడల్ టెస్ట్‌లకు హాజరవ్వాలి. ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ గేట్ లో సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది.
ప్రిపరేషన్ ప్లాన్
అభ్యర్థులకు సుమారు ఆరు నెలలు సమయం ఉన్నందున ముందు సిలబస్, పరీక్ష విధానంపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. మంచి స్కోర్ సాధించాలంటే ఎంచుకున్న సబ్జెక్ట్‌లోని బేసిక్స్ మీద పట్టు సాధించాలి. ప్రీవియస్ పేపర్స్ పరిశీలించి, ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్కులు ఇస్తున్నారో గమనించాలి. వీక్లి టెస్టులు, మాక్ టెస్టులు, మోడల్ టెస్టులు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. గేట్ సిలబస్‌ను అకడమిక్ సిలబస్‌తో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. డిసెంబర్ చివరి వారం వరకు ప్రిపరేషన్ పూర్తి చేసుకొని రివిజన్‌కు సమయం కేటాయించుకోవాలి.
ముఖ్యసమాచారం
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్స్ ప్రారంభం: 30 ఆగస్టు
చివరి తేదీ: 24 సెప్టెంబర్
ఎగ్జామ్: 2022 ఫిబ్రవరి 5, 6, 12, 13
రిజల్ట్స్: 17 మార్చి 2022
వెబ్‌సైట్: www.gate.iitkgp.ac.in