- ఏపీలో బీఆర్‌ఎస్ విస్తరణ
- నేపథ్యంలో పెరిగిన ప్రాధాన్యం
- ఎప్పుడంటే అప్పుడు వెళ్లి కేసీఆర్‌ను కలిసే చాన్స్
- బస కోసం ప్రగతిభవన్ సమీపంలో హోటల్ రూమ్స్
- రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు మాత్రం దొరకని సీఎం అపాయింట్‌మెంట్
హైదరాబాద్, వెలుగు: ఆంధ్రా నేతలకు ప్రగతిభవన్ గేట్లు బార్లా తెరుచుకుంటున్నాయి. ఎప్పుడు అనుకుంటే అప్పుడు వాళ్లకు సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ దొరుకుతున్నది. బుధవారం సీఎస్‌గా శాంతికుమారి పేరును అధికారికంగా ప్రకటించారో లేదో.. ఇంతలోనే ఏపీ లీడర్ల టీమ్ ప్రగతిభవన్‌లో ప్రత్యక్షమైంది. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ను కేసీఆర్ విస్తరించాలనుకోవడంతో ప్రగతి భవన్ సహా తెలంగాణ ప్రభుత్వంలో ఆంధ్రా లీడర్లకు ప్రయారిటీ పెరిగింది. అయితే.. రాష్ట్ర మంత్రులు, ఇక్కడి ఎమ్మెల్యేలు, లీడర్లకు మాత్రం కేసీఆర్ అపాయింట్‌మెంట్ దొరకడం గగనమవుతున్నది. రాష్ట్ర నేతలు కొందరు ప్రగతి భవన్ లోపలికి వెళ్లినా కేసీఆర్, కేటీఆర్‌ను కలవకుండానే వెనుదిరుగుతున్నారు. ఇంకొందరికైతే ఆ చాన్స్ కూడా ఉంటలేదు. ప్రగతి భవన్ గేట్ లోపలికి సైతం రానివ్వడం లేదనే విమర్శలు ఉన్నాయి.
ఇక్కడి మంత్రులు కూడా కలువకముందే!
బుధవారం సోమేశ్ కుమార్ స్థానంలో శాంతికుమారిని సీఎస్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆమెను సీఎస్‌గా నియమించడం వెనుక ఏపీ బీఆర్‌ఎస్ నేతల లాబీయింగ్ కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. శాంతికుమారిని సీఎస్‌గా నియమించిన వెంటనే ఏపీ బీఆర్‌ఎస్ నేతలు ప్రగతిభవన్‌కు వెళ్లి అభినందించారు. కేసీఆర్‌తో పాటు కొత్త సీఎస్, ఏపీ బీఆర్‌ఎస్ నేతలు ఉన్న ఫొటోలను సీఎంవోనే రిలీజ్ చేసింది. అప్పటి వరకు తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కొత్త సీఎస్‌ను కలువలేదు. తమిళనాడుకు చెందిన జనసేన నాయకుడు కూడా ప్రగతి భవన్‌లోకి వెళ్లి కొత్త సీఎస్‌ను అభినందించారు. ఇంత జరుగుతున్నా తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలెవరూ ప్రగతి భవన్‌లో కనిపించలేదు. ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభకు ఏపీ సరిహద్దు నియోజకవర్గాల నుంచి కనీసం లక్ష మందిని సమీకరించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. దీనిపై చర్చల పేరుతోనూ ఏపీ లీడర్లు సీఎంతో తరచూ సమావేశమవుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై రోజూ ఏదో ఒక చోట ఆందోళనలు, నిరసనలు, ప్రగతి భవన్ ముట్టడి లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి కేసీఆర్ చొరవ చూపించడంలేదు. ఎంతసేపు రాజకీయాలు, ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌కు ఎలా ప్రజాధరణ పెంచుకోవాలనే కోణంలోనే ఆయన ప్రయత్నాలుంటున్నాయన్న విమర్శలు వస్తున్నాయి.
వాళ్లకో రకం.. ఇక్కడోళ్లకు మరో రకం
బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తున్న ఏపీ నేతల్లో కొందరు హైదరాబాద్‌లోని తమ నివాసాల్లో ఉంటుండగా, మరికొందరికి బీఆర్‌ఎస్ తరపున ప్రగతి భవన్ సమీపంలోని ప్రముఖ హోటల్‌లో రూమ్‌లు బుక్ చేశారు. వీరిలో కొందరిని ప్రగతి భవన్ నుంచే ఫోన్లు చేసి పిలిపించుకుంటుండగా.. మరికొందరు సీఎంను కలవడానికనో, ఇతర పనులని చెప్పో లోపలికి వెళ్తున్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో పలు పనులు చక్కబెట్టుకునేందుకు ఏపీ లీడర్లకు బీఆర్‌ఎస్ రూపంలో అనుకోని అవకాశం దక్కింది. ఏపీలో పార్టీ విస్తరణ, అక్కడ ఓటు బ్యాంకు పెంచుకునేందుకు ఉన్న అవకాశాలేమిటో చెప్తూ వాళ్లు కేసీఆర్‌తో భేటీ అవుతున్నారు. తెలంగాణకు చెందిన నేతలెవరినీ ఈ మధ్య కాలంలో కేసీఆర్ కలవడం లేదు. ముందే అపాయింట్‌మెంట్ కోరినా నుంచి స్పందన రావడం లేదు. ఇటీవల తెలంగాణకు చెందిన ఒక ఎమ్మెల్యే జిల్లా రాజకీయాలపై చర్చించేందుకు కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోరారు. పది రోజులు గడిచినా ఎలాంటి సమాధానం రాలేదు. కనీసం కేటీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించినా ఫాయిదా ఉంటలేదని ఇక్కడి ఎమ్మెల్యేలు అంటున్నారు.