- హాజరైన మంత్రి జూపల్లి, మైహోం చైర్మన్ రామేశ్వరరావు
కొల్లాపూర్ ,వెలుగు: పట్టణంలోని ఆర్ఐడీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సురభి రాజుల బంగ్లా ఆవరణలో బుధవారం ఘనంగా జరిగింది. మంత్రి జూపల్లి కృష్ణారావు, మై హోం చైర్మన్ జూపల్లి రామేశ్వర రావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సందడి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సురభి సంస్థాన భవనాలు విద్య, ప్రభుత్వ ఆఫీసుల కోసం ఇచ్చారని గుర్తు చేశారు. ఆనాడే రాజులు విద్యాభివృద్ధికి కృషి చేశారన్నారు.
సైంటిస్టులు, వైద్యులు, యూనివర్సిటీ వీసీలు, ప్రొఫెసర్లుగా ఎంతో మందిని ఆర్ఐడీ పాఠశాల తీర్చిదిద్దిందని కొనియాడారు. రామేశ్వరరావు మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు మంచి సందేశం ఇచ్చేందుకు, చైతన్యం, సంస్కారం, ధైర్యం నింపేందుకు స్వర్ణోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూర్వ విద్యార్థుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సాయి ప్రసాద్ రావు, దయాసాగర్ రావు, తెలుగు యూనివర్సిటీ వీసీ శివారెడ్డి, ప్రొఫెసర్ రాంగోపాల్ రావు, ప్రొఫెసర్ జయరాంరెడ్డి, సురభి ఆదిత్య రాజు లక్ష్మణరావు, మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య పాల్గొన్నారు.