నాయకపోడ్​ల చరిత్రకు మూలం గట్టమ్మ తల్లి

నాయకపోడ్​ల చరిత్రకు మూలం గట్టమ్మ తల్లి
  • గొంతెమ్మ, గట్టమ్మ, లక్ష్మీదేవరల చరిత్రను కాపాడుకోవాలి
  • ఆరోపణలు చేసేవారు చారిత్రక వాస్తవాలను గుర్తించాలి
  • సమ్మక్క, సారలమ్మ పరిశోధన బృందం సభ్యులు 
  • కాక నర్సింగరావు, బుగ్గ కోటేశ్వరరావు
  • ములుగులోని గట్టమ్మ ఆలయ పరిసరాల్లో మూడు రోజులు చరిత్ర పరిశోధన

ములుగు, వెలుగు: ఆదివాసీ నాయకపోడ్​ల చరిత్రంతా గట్టమ్మ మూలంతో ముడిపడి ఉందని సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ పరిశోధన  బృందం డైరెక్టర్​కాక నర్సింగరావు, జాయింట్ డైరెక్టర్ ​బుగ్గ కోటేశ్వర్​రావు పేర్కొన్నారు.  ములుగులోని గట్టమ్మ ఆలయ పరిసరాల్లో రెండు రోజులపాటు బృందం సభ్యులు నాయకపోడ్​ సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్​, గట్టమ్మ పూజారులతో కలిసి చరిత్రపై పరిశోధనలు చేశారు.

సోమవారం సైతం గట్టమ్మ వద్ద పరిశోధనలు చేసి పలు చారిత్రక అంశాలను గుర్తించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ​నర్సింగరావు, జాయింట్ డైరెక్టర్​ కోటేశ్వర్​రావు, ఆదివాసీ మ్యూజియం అసిస్టెంట్​ క్యూరేటర్​ కుర్సం రవి మాట్లాడారు. గొంతెమ్మ, గట్టమ్మ, లక్ష్మీదేవరల చరిత్రను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. గట్టమ్మ తల్లికి చరిత్ర లేదని ఆరోపణలు చేసేవారు నాయకపోడ్​ల చరిత్ర గట్టమ్మతల్లి మూలాలతో ముడిపడి ఉందనే చారిత్రక విషయాలను గుర్తించాలని సూచించారు.  పరిశోధన బృందం సేకరించిన తాళపత్ర మూలాల్లోని ఆధారాలతో నాలుగు కిలోమీటర్ల మేర పర్యటించి పురాతన చరిత్ర కలిగిన కొండలు, గుహలు, కోనేర్లను గుర్తించామని తెలిపారు.

ఆదివాసీ నాయకపోడ్​ల చరిత్రను బహిర్గతం చేస్తూ ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉందని, అందుకు ప్రభుత్వం కూడా కృషి చేయాలని వారు కోరారు. మేడారం సమ్మక్క తల్లికి అంగరక్షకులుగా ఉన్న ఐదుగురిలో గట్టమ్మ దేవర ముఖ్యమని పేర్కొన్నారు. నాయకపోడ్ తెగలోని పూర్తి వంశవృక్షం, గోత్రాల ఏర్పాటు, తెగలోని ఇంటి పేర్లు ఎలా వచ్చాయనే చరిత్ర ఆదివాసీలు, నాయక పోడ్​ వారసులు తెలుసుకోవాలన్నారు.

ప్రభుత్వం లక్ష్మి దేవరల గుళ్ల రక్షణకు పాటు పడాలని, తమ సంస్కృతిని రక్షించాలని, గట్టమ్మ సన్నిధిలో మ్యూజియం ఏర్పాటు చేయాలని పరిశోధన కేంద్రం సభ్యులు కోరారు. ఈ పరిశోధనలో సభ్యులు గట్టిపల్లి అర్జున్, కాక నితిన్, ఉనేని మధు, గట్టమ్మ ప్రధాన పూజారులు కొత్త సదయ్య, కొత్త  లక్ష్మయ్య, అరిగెల సమ్మయ్య, ఆకుల మొగిలి, కొత్త సురేందర్ తదితరులు 
పాల్గొన్నారు.