గట్టు లిఫ్ట్ కెపాసిటీ పెంపు!

 గట్టు లిఫ్ట్ కెపాసిటీ పెంపు!
  • 1.3 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచుతూ ప్రపోజల్స్
  • రీ ఎగ్జామ్  చేసి రిపోర్ట్  ఇవ్వాలని స్టేట్  ఇరిగేషన్  ఆఫీసర్ల ఆదేశం
  • వచ్చే రాష్ట్ర స్థాయి స్టాండింగ్  కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం

గద్వాల, వెలుగు:నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించ తలపెట్టిన గట్టు లిఫ్ట్  రిజర్వాయర్  కెపాసిటీని 1.3 టీఎంసీల నుంచి మూడు టీఎంసీలకు పెంచేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ మేరకు హైదరాబాద్​లో గురువారం జరిగిన స్టేట్  లెవెల్  స్టాండింగ్  కమిటీలో పెంపు నిర్ణయాన్ని ఆమోదించాల్సి ఉన్నప్పటికీ.. రివైజ్డ్​ రిపోర్ట్​ పంపించాలని వాయిదా వేశారు. వచ్చే మీటింగ్ లో కెపాసిటీ పెంపు ప్రపోజల్ ను ఆమోదించే చాన్స్  ఉన్నట్లు ఇరిగేషన్  ఆఫీసర్లు చెబుతున్నారు. 

దీంతో రిజర్వాయర్ నిర్మాణ పనుల ఎస్టిమేషన్లు కూడా పెరగనున్నాయి. ప్రస్తుతం 1.3 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టే రిజర్వాయర్ కు రూ.581 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. మూడు టీఎంసీలకు పెంచితే రూ. 1,500 కోట్ల వరకు అంచనాలు పెరిగే అవకాశం ఉన్నట్లు ఇరిగేషన్ ఆఫీసర్లు ప్రపోజల్స్​ తయారు చేశారు.

గట్టు లిఫ్ట్  కథ ఇదీ..

ఎత్తైన ప్రాంతంలోని గట్టు మండలానికి సాగునీటిని ఇవ్వాలనే ఉద్దేశంతో గట్టు లిఫ్ట్  రిజర్వాయర్ కు రూపకల్పన చేశారు. కేటిదొడ్డి, మల్లాపురం గ్రామాల మధ్య ఉన్న వ్యవసాయ భూముల్లో గట్టు లిఫ్ట్​ నిర్మాణానికి ఐదేండ్ల కింద శంకుస్థాపన చేశారు. మొదట 33 వేల ఎకరాలకు సాగు నీటిని ఇచ్చేందుకు 1.3 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్  నిర్మాణాన్ని చేపట్టారు. 

దీనికి రూ.581 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఐదేండ్ల కింద గట్టు లిఫ్ట్  పనులు ప్రారంభమైనప్పటికీ, 30 శాతానికి మించి పనులు కంప్లీట్  కాలేదు. గట్టు లిఫ్ట్  పనులకు గత ప్రభుత్వం టెండర్లు పిలిచినప్పటికీ, నిధులు విడుదల చేయకపోవడంతో పనులు స్లోగా జరిగాయి. ఏడాదిలో కంప్లీట్  చేస్తామని చెప్పినప్పటికీ, ఆ తరువాత పట్టించుకోకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.

కొత్తగా భూసేకరణ అవసరం లేకుండానే..

గట్టు లిఫ్ట్  రిజర్వాయర్  సామర్థ్యం పెంపుతో ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. గట్టు మండలంలోని 33 వేల ఎకరాలతో పాటు మరిన్ని ఎకరాలకు సాగునీటిని ఇచ్చే అవకాశం ఉంటుంది. ర్యాలంపాడ్  రిజర్వాయర్​లో నీటి నిల్వలు తగ్గినా, ఆ రిజర్వాయర్  కింద ఉండే ఆయకట్టుకు కూడా నీళ్లిచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉన్న రిజర్వాయర్ నే కొంత మాడిఫికేషన్  చేసి, కొత్తగా ఎలాంటి భూసేకరణ చేయకుండానే మూడు టీఎంసీలకు రిజర్వాయర్  కెపాసిటీని పెంచవచ్చని ఇరిగేషన్  నిపుణులు చెబుతున్నారు.

రీ ఎగ్జామ్ చేసి రిపోర్ట్ ఇవ్వమన్నారు..

హైదరాబాద్​లో గురువారం జరిగిన స్టేట్  లెవెల్  స్టాండింగ్  కమిటీ మీటింగ్​లో గట్టు లిఫ్ట్  రిజర్వాయర్ కెపాసిటీ పెంపుపై నిర్ణయం తీసుకోలేదు. రీ ఎగ్జామ్​ చేసి రిపోర్ట్  ఇవ్వమని ఆదేశించారు. వచ్చే మీటింగ్ లో కెపాసిటీ పెంపుపై నిర్ణయం తీసుకోవచ్చు.- రహీముద్దీన్, ఎస్ఈ, ఇరిగేషన్