- పోలీసులకు ఫోన్ చేసిన గట్టుప్పల్ గ్రామస్తులు
- ఊర్లో కరోనాతో 8 మంది మృతి..
- హెల్త్ ఆఫీసర్లు పట్టించుకుంటలేరని ఆవేదన
- రంగంలోకి పోలీసులు.. హెల్త్ క్యాంప్ ఏర్పాటు
- 111 మందికి టెస్ట్ చేస్తే 41 మందికి పాజిటివ్
మునుగోడు (చండూరు) వెలుగు: కరోనా టెస్టులు చేయాలని అడిగితే హెల్త్ ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో నల్గొండ జిల్లా చండూరు మండలం గట్టుప్పల్ గ్రామస్తులు పోలీసులకు ఫోన్ చేశారు. ‘సచ్చిపోతున్నాం.. కాపాడండి సారూ..’ అంటూ వేడుకున్నారు. దీంతో పోలీసులు హెల్త్ ఆఫీసర్లతో మాట్లాడారు. గ్రామంలో క్యాంప్ ఏర్పాటు చేసి టెస్టులు చేయించారు. బుధవారం ఒక్కరోజే 111 మందికి టెస్టులు చేయించగా.. 41 మందికి పాజిటివ్ వచ్చింది. గట్టుప్పల్ లో 9,500 మంది జనాభా ఉంది. గ్రామంలో ఇప్పటికే ఉప సర్పంచ్ నారనీ రామలింగంతో పాటు కరోనాతో 8 మంది మృతి చెందారు. వందల మంది హోం ఐసోలేషన్ లో ఉంటున్నారు. చాలా మందికి సింప్టమ్స్ వస్తున్నాయి. రోజూ ఎవరో ఒకరు చనిపోతుండటం, కిట్లు లేక టెస్టులు ఆపేయడంతో గ్రామస్తుల్లో భయాందోళన నెలకొంది.
హైస్కూల్ లో క్వారంటైన్ సెంటర్
పీహెచ్సీలో టెస్టులు నిలిపేయడంతో సింప్టమ్స్ఉన్నవారు ప్రైవేట్ ల్యాబ్‌లలో చేయించుకుంటున్నారు. పాజిటివ్ వచ్చినవారికి మెడికల్ ఆఫీసర్లు ట్రీట్మెంట్ ఇవ్వడంలేదు. ఇంట్లో ఉంటే చాలు అని చెప్తున్నారు. సింప్టమ్స్ ఉన్నోళ్లందరికీ టెస్టులు చేయాలని, కరోనాతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని ఆస్పత్రులకు తరలించి ట్రీట్ మెంట్ ఇప్పించాలని గ్రామస్తులు కోరినా పట్టించుకోలేదు. దీంతో ‘మీరన్నా మమ్మల్ని కాపాడండి’ అంటూ గ్రామస్తులు డయల్ 100కు ఫోన్ చేశారు. రెండు రోజుల కిందట పోలీసులు గ్రామస్తులతో మాట్లాడి వెళ్లారు. పోలీసుల సూచనల మేరకు హెల్త్ డిపార్ట్ మెంట్ స్పందించింది. బుధవారం ఊర్లో హెల్త్ క్యాంపు ప్రారంభించారు. మొదటిరోజు 41 మందికి పాజిటివ్ వచ్చింది. గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో క్వారంటైన్ సెంటర్ ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. గట్టుప్పల్‌లో దాదాపుగా ఇంటికొకరికి కరోనా సోకిందని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ప్రభుత్వం టెస్టులు చేయించకపోవడంతో ఎవరికి కరోనా ఉందో? ఎవరికి లేదో? తెలియడం లేదు. వైరస్ సోకినా సింప్టమ్స్ లేనివారు కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం వల్ల చాలామందికి వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు.
కిట్లు లేవని వెనక్కి పంపిన్రు
ఊళ్లో కొంత మందికి జ్వరం రావడంతో టెస్టుల కోసం మండలానికి వెళ్లారు. అక్కడ కిట్లు లేవని తిప్పి పంపారు. అనుమానం ఉన్నవాళ్లు ట్యాబ్లెట్లు కొనుక్కొని వాడుతున్నరు. ఊళ్లో ఎక్కువ మంది పేదలే ఉన్నరు. చిన్న ఇండ్లలోనే అందరూ కలిసి ఉండడం వల్ల ఇంట్లో ఒకరికి పాజిటివ్ ఉంటే అందరికీ వైరస్ సోకుతోంది.
– యిడం రోజా, గట్టుప్పల్ సర్పంచ్