భారత అపర కుభేరుడు గౌతమ్ అదానీకి అమెరికా నుంచి అరెస్ట్ వారెంట్ నోటీసులు పంపారు. భారతదేశంలో సోలార్ పవర్ ఉత్పత్తి కోసం 20 సంవత్సరాల కాంట్రాక్ట్ కుదుర్చుకునేందుకు అమెరికాలో ఇన్వస్టర్లు, వరల్డ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి నిధులు సేకరించాలని ప్రయత్నించారు. ఆ కాంట్రాక్ట్ దక్కించుకోవడం కోసం అదానీ 2 వేల 100 కోట్లు ఇండియన్ గవర్నమెంట్ ఆఫీసర్లకు ముట్టజెప్పాడని అమెరికాలోని ఫెడరల్ కోర్టులో కేసు విచారణ జరుగుతుంది.
ప్రభుత్వ యాజమాన్యంలోని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి 12 గిగావాట్ల సోలార్ పవర్‌ను అందించేందుకు అదానీ ఎనర్జీ కంపెనీ, US ఇష్యూయర్ అనే రెండు కంపెనీలు ఒక ఒప్పందాన్ని పొందాయని US ప్రాసిక్యూటర్లు తెలిపారు. సోలర్ పవర్ కొనుగోలుదారులు లేకుండా కాంట్రక్ట్ ఇచ్చేందుకు రెండు కంపెనీలు కలిసి గవర్నమెంట్ ఆఫీసర్లకు రూ.2,100 కోట్లు లంచం ఇచ్చాయి. ఈ కాంట్రక్ట్ తో అదానీ ఎనర్జీ కంపెనీ, US ఇష్యూయర్ అనే రెండు కంపెనీలు 2 బిలియన్ డాలర్ల లాభాన్ని పొందాలని చూశాయి.
ప్రస్తుతం ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (FCPA) కింద అదానీ అమెరికా ఇన్వెస్టర్లను మోసం చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. అమెరికన్ సోలార్ ప్రొడక్షన్ కంపెనీలతో టైఅప్ అయి ఇండియాలో 20 సంవత్సరాల వరకు సౌరశక్తి ఉత్పత్తి చేయాలి. అయితే ఈ కాంట్రాక్ట్ తనకే రావడానికి అదానీ అక్షరాల 2వేల 100 కోట్లు ఇండియాలో ప్రభుత్వం అధికారులకు లంచం ఇచ్చాడని ఫారెన్ ఇన్వెస్టర్లు కోర్టును ఆశ్రయించారు. అక్రమంగా కాంట్రాక్ట్ ను దక్కించుకొని అమెరికాలో ఇన్వెస్టర్ల నుంచి నిధులు సేకరించాడని న్యాయవాదులు వాదిస్తున్నారు. 2020 నుంచి 2024 మధ్య కాలంలో అనుకున్న లంచాన్ని అదానీ ఇండియన్ గవర్నమెంట్ అధికారులకు ఇచ్చారని మోసపోయిన వారు చెప్తున్నారు.
కేసు ఏంటి?
అమెరికాలోని ఈస్టర్న్ డిస్ట్రిక్ ఆఫ్ న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో అదానీపై ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (FCPA) పై కేసు ఫైల్ చేశారు. ఈ చట్టం అమెరికాది కాబట్టి.. నేరం రుజువైతే అక్కడి రూల్స్ ప్రకారమే అదానీకి శిక్షపడే అవకాశం ఉంది. ఈ కేసులో 2 మిలియన్ డాలర్ల (రూ.16కోట్ల 88 లక్షల 62వేల 583) జరిమానా, 5 సంవత్సరాల జైలు శిక్ష విధించే ఛాన్స్ కూడా ఉంటుంది.
యూస్ అటార్ని కార్యాలయం నుంచి కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. భారత ప్రభుత్వ అధికారులకు 2,100 కోట్లు లంచం ఇవ్వడానికి సిద్దమైనట్లు సాక్ష్యాలు కూడా క్లియర్ గా ఉన్నాయంట. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, డిటేల్ స్పెడ్ షీట్స్, ఫొటోగ్రాఫ్స్, గౌతమ్ అదానీ మేనల్లుడు సాగర్ అదానీ ఫోన్లో అధికారులకు ఇచ్చే లంచం గురించి డాకుమెంట్లు ఉన్నయని ఆధారాలు చూపించారు అమెరికా న్యాయవాదులు.
కేసులో ఎవరెవరు ఉన్నారు..?
అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు, కంపెనీ ఎగ్జిక్యూటివ్ సాగర్ R. అదానీ, ఇండియన్ ఎనర్జీ కంపెనీ మాజీ CEO S. జైన్, US ఇష్యూయర్ మాజీ CEO రంజిత్ గుప్తా మొత్తం నలుగురు ఈ ఫ్రాడ్ లో ఉన్నట్లు సమాచారం. వీరితోపాటు మోసం గురించి తెలిసి ఇతరులకు చెప్పని నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను కూడా కేసులో భాగమై ఉన్నారు.