అంబానీకి అదానీ షాక్‌!

అంబానీకి అదానీ షాక్‌!
  •     రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌కు పోటీగా కంపెనీ
  •     ఇక పెట్రోకెమికల్‌‌ బిజినెస్‌‌లో కూడా అదానీ గ్రూప్‌‌

న్యూఢిల్లీ: ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌తో పోటీ పడేందుకు గౌతమ్ అదానీ రెడీ అవుతున్నారు. ఇప్పటికే  పోర్ట్స్‌‌, ఎయిర్‌‌‌‌పోర్ట్స్‌‌, గ్రీన్ ఎనర్జీ వంటి  సెగ్మెంట్లలో బిజినెస్ చేస్తున్న అదానీ గ్రూప్‌‌,  కొత్తగా పెట్రో కెమికల్స్ బిజినెస్‌‌లో కంపెనీని ఏర్పాటు చేసింది. అదానీ పెట్రో కెమికల్స్‌‌ లిమిటెడ్‌‌ (ఏపీఎల్‌‌) పేరుతో తీసుకొచ్చిన ఈ కంపెనీ, అదానీ గ్రూప్‌‌కు ఫుల్లీ ఓన్డ్ సబ్సిడరీగా పనిచేస్తుంది. రిఫైనరీలు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌‌లు, స్పెషాలిటీ కెమికల్స్, హైడ్రోజన్‌‌ ఫ్యూయల్‌‌కు సంబంధించిన ప్లాంట్లను ఏపీఎల్ ద్వారా ఆపరేట్ చేస్తారు. దేశంలోని  అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ కంపెనీలలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌ ఒకటి. అదానీ గ్రూప్‌‌ ఎక్కువగా ఫోకస్‌‌ చేస్తున్న గ్రీన్ ఎనర్జీలోకి ఎంటర్ అవుతామని జూన్‌‌లో ముకేష్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. సుమారు రూ. 75 వేల కోట్లను ఇన్వెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. ఇప్పుడు ముకేష్ అంబానీ మెయిన్ బిజినెస్ అయిన పెట్రోకెమికల్స్‌‌లోకి ఎంటర్ అవ్వాలని అదానీ గ్రూప్‌‌ నిర్ణయించుకుంది. 

జర్మనీకి చెందిన కెమికల్ కంపెనీ బీఏఎస్‌‌ఎఫ్‌‌తో కలిసి  గుజరాత్‌‌లోని ముంద్రాలో రెండు బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసేందుకు అదానీ గ్రూప్ 2019 లో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అదే ఏడాది అక్టోబర్‌‌‌‌లో ఈ  వెంచర్‌‌‌‌లోకి అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఏడీఎన్‌‌ఓసీ), బోరియలిస్‌‌ ఏజీలు కూడా జాయిన్ అయ్యాయి. ఈ నాలుగు కంపెనీలు కలిసి ముంద్రాలో కెమికల్ కాంప్లెక్స్‌‌ను ఏర్పాటు చేయడంపై స్టడీని కూడా నిర్వహించాయి.  కరోనా వల్ల ఈ పనులు ముందుకు వెళ్లలేదు. కానీ, ఈ ఏడాది ఏప్రిల్‌‌లో  ‘ముంద్రా పెట్రోకెమ్‌‌ లిమిటెడ్‌‌’ ఓ సబ్సిడరీని ఏర్పాటు చేసింది అదానీ గ్రూప్‌‌. బొగ్గు, ఇసుక, తార్‌‌‌‌, ఆయిల్, ఎల్‌‌పీజీ, ఎల్‌‌ఎన్‌‌జీ, ఈథేన్‌‌ , ఎల్‌‌పీజీ వంటి రిఫైనరీలను, పెట్రోకెమికల్‌‌, కెమికల్ ప్లాంట్లను ఈ కంపెనీ ఏర్పాటు చేయనుంది. కానీ, బీఏఎస్‌‌ఎఫ్‌‌తో కుదిరిన అగ్రిమెంట్‌‌లో భాగంగా ముంద్రా పెట్రోకెమికల్‌‌ను ఏర్పాటు చేశారా? అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. తాజాగా ఏర్పాటు చేసిన అదానీ పెట్రోకెమికల్స్ లిమిటెడ్‌‌ క్రూడాయిల్‌‌ రిఫైనరీపై ఎక్కువ ఫోకస్‌‌ పెట్టే అవకాశం ఉంది. ఈ ఏడాది జూన్‌‌లో సిమెంట్ తయారీలోకి కూడా అదానీ గ్రూప్ కూడా వచ్చింది.