గౌతమ్ అదానీని వెంటనే అరెస్ట్ చేయాలి: రాహుల్ గాంధీ డిమాండ్

గౌతమ్ అదానీని వెంటనే అరెస్ట్ చేయాలి: రాహుల్ గాంధీ డిమాండ్

న్యూఢిల్లీ: సోలార్ క్రాంటాక్టులు దక్కించుకోవడం కోసం భారత ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ గౌతమ్ అదానీ ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో కేసు నమోదు కావడం సంచలనం రేపుతోంది. ఈ క్రమంలో గౌతమ్ అదానీపై వెల్లువెత్తుతోన్న అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024, నవంబర్ 21న ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిలియనీర్ గౌతమ్ అదానీ అమెరికన్ చట్టం, భారతీయ చట్టం రెండింటినీ ఉల్లంఘించారని ఇప్పుడు అమెరికాలో కేసు నమోదు కావడంతో స్పష్టమైందన్నారు.

 బిలియనీర్ గౌతమ్ అదానీపై తన దీర్ఘకాల ఆరోపణలను తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయని పేర్కొన్నారు. వెంటనే గౌతమ్ అదానీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. అదానీతో పాటు అతడికి రక్షణగా ఉన్న సెబీ చైర్ పర్సన్ మాదబి పూరీ బుచ్‌ను తొలగించి ఆమెపై దర్యాప్తునకు ఆదేశించాలన్నారు. భారత్‎లో కొందరు సీఎంలు రూ.10, -15 కోట్ల కుంభకోణాలకు పాల్పడి జైలు పాలయ్యారు. కానీ 2,000 కోట్ల కుంభకోణం చేసిన గౌతమ్ అదానీ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. 

ALSO READ | Goutham Adani: అవన్నీ నిరాధార ఆరోపణలు..న్యాయ పోరాటం చేస్తా: అదానీ

ఆయనపై ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకోరని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీపై రాహుల్ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ అదానీతో కలిసి అవినీతికి పాల్పడ్డారని.. ఇప్పుడు అదానీ అరెస్ట్ కాకుండా రక్షించేది కూడా ప్రధాని మోడీనే అనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని రాహుల్ ఆరోపించారు. బీజేపీ అదానీకి మద్దతు ఇస్తుందనే విషయం అందరికి తెలిసిందేనని అన్నారు. 

అదానీ ఏం చేశారో మేం దేశ ప్రజలకు చెప్పగలిగామని.. ఇప్పుడు అదానీని ఎవరో రక్షిస్తున్నారనే విషయం దేశ ప్రజలందరికి తెలిసిపోయిందన్నారు. అధికారులకు లంచాలు ఇచ్చారన్న ఆరోపణలపై అమెరికాలో అదానీపై కేసు నమోదైన అంశాన్ని శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తుతామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అదానీ అవినీతి అంశంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ (జేపీసీ) వేయాలని ఈ సందర్భంగా రాహుల్ డిమాండ్ చేశారు.