ఆస్ట్రేలియాపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 1-3 తేడాతో భారత్ ఓడిపోవడంతో భారత్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. సిడ్నీ టెస్టులో గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకుందామనుకున్న టీమిండియా ఆశలు ఫలించలేదు . 162 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా ఓపెనర్ ఖవాజా(41), హెడ్ (35), వెబ్ స్టర్ (30) బ్యాటింగ్ లో రాణించడంతో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
భారత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఘోర ప్రదర్శన చేయడంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మపై బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకోనుందని సమాచారం. వీరిద్దరిని త్వరలో సాగనంపడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే చివరి టెస్ట్ నుంచి రోహిత్ తప్పుకున్నాడు. ఏడాది కాలంగా రోహిత్ టెస్టుల్లో బ్యాటింగ్ తో పాటు.. కెప్టెన్సీలోనూ ఘోరంగా విఫలమవుతున్నాడు. ముఖ్యంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో హిట్ మ్యాన్ ఘోరంగా విఫలమయ్యాడు. రోహిత్ ప్రదర్శన బీసీసీఐకి అసలు నచ్చలేదు.
రోహిత్ ను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పించి అతని స్థానంలో బుమ్రాకు పూర్తిస్థాయిలో టెస్ట్ పగ్గాలు అప్పజెప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంగ్లాండ్ తో జూన్ నెలలో జరగబోయే 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు బీసీసీఐ భారత టెస్ట్ ఫార్మాట్ కు కొత్త కెప్టెన్ ను ప్రకటించనుందని సమాచారం. ఇదిలా ఉంటే హిట్ మ్యాన్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కొన్ని నివేదికలు చెప్పుకొస్తున్నాయి. ఇప్పటికే టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు చెప్పిన రోహిత్.. టెస్టుల నుంచి తప్పుకున్న ఆశ్చర్యం లేదు.
ALSO READ : IND vs AUS: సిడ్నీ టెస్టులో చిత్తుగా ఓడిన భారత్.. టెస్ట్ ఛాంపియన్ షిప్ నుంచి ఔట్
మరోవైపు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పదవి ప్రమాదంలో పడింది. ఎన్నో అంచనాల మధ్య గంభీర్ ను టీమిండియా హెడ్ కోచ్ గా ప్రకటిస్తే అతని హయాంలో భారత్ ఘోరంగా విఫలమైంది. బలహీనమైన శ్రీలంకపై వన్డే 0-2 తేడాతో సిరీస్ ఓటమితో పాటు సొంతగడ్డపై న్యూజిలాండ్ పై 0-3 తేడాతో టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్ అయింది. దీంతో భారత్ టెస్ట్ ఛాంపియన్ షిప్ అవకాశాలు సన్నగిల్లాయి. ఆస్ట్రేలియా సిరీస్ లో ఓడిపోవడంతో ఇక గంభీర్ ను కొనసాగించే ఉద్దేశ్యంలో బీసీసీఐ లేనట్టు వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరిలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత గంభీర్ కు హెడ్ కోచ్ పదవి నుంచి బీసీసీఐ తొలగించే అవకాశం ఉంది.