భారత మాజీ బ్యాటర్ గౌతమ్ గంభీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టీమిండియాలో ఓపెనర్ గా తనదైన ముద్ర వేసిన ఈ ఢిల్లీ బ్యాటర్.. ఐపీఎల్ లో బ్యాటర్ గా, కెప్టెన్ గా అదరగొట్టేసాడు. ఐపీఎల్ నుంచి తప్పుకున్నాక రాహుల్ సారధ్యంలోని లక్నో జట్టుకు మెంటార్ గా వ్యవహరించి అద్భుతమైన విజయాలను అందించాడు. అయితే తాజాగా గంభీర్ అనూహ్య నిర్ణయం తీసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. మెంటార్ గా లక్నోకు రాజీనామా చేసి కోల్ కత్తా జట్టుకు మెంటార్ గా వ్యవహరించనున్నాడు.
2022, 2023 లక్నో జట్టుకు గంభీర్ మెంటార్ గా వ్యవహరించాడు. ఈ క్రమంలో జట్టును రెండు సార్లు ప్లే ఆఫ్ కు తీసుకొని వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. లక్నో ఐపీఎల్ 2024 సీజన్ కోసం మెంటార్ గా ఆస్ట్రేలియా T20 ప్రపంచ కప్ విజేత కోచ్ జస్టిన్ లాంగర్‌ను ఎంపిక చేసింది. 'లక్నో సూపర్ జెయింట్స్‌తో నా గొప్ప ప్రయాణం ముగిసింది. నా జర్నీలో నాకు సహకరించిన ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది పట్ల కృతజ్ఞతతో నిండి ఉన్నాను'. అని గంభీర్ సోషల్ మీడియాలో తెలిపాడు.
Amazing Journey... All the Best Gautam Bhai... Love You ♥️♥️♥️ pic.twitter.com/wzxmZkwxvB
— ?? Pundalik ?? (@iPundalikH) November 22, 2023
గంభీర్ గతంలో కోల్ కత్తా జట్టు తరపున ఆడాడు. ఆ జట్టుతో విడదీయరాని బంధం ఉంది. ఐపీఎల్ ప్రారంభంలో ఢిల్లీ జట్టుకు ఆడిన గంభీర్.. 2011 నుంచి 2017 వరకు కోల్ కత్తా జట్టుకు ఆడాడు. గంభీర్ సారధ్యంలో కేకేఆర్ 2012, 2014 లో ఐపీఎల్ టైటిల్ నెగ్గడంతో పాటు 2014లో జరిగిన ఛాంపియన్స్ లీగ్ T20 ఫైనల్స్‌కు చేరుకుంది. కేకేఆర్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన ఈ ఢిల్లీ ప్లేయర్ 2024 ఐపీఎల్ లో మెంటార్ గా కొత్త బాధ్యతలు స్వీకరించనున్నాడు.