Team India: టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్‌గా నెదర్లాండ్స్ క్రికెటర్..? ఎవరీ ర్యాన్ టెన్ డోస్చాట్..?

Team India: టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్‌గా నెదర్లాండ్స్ క్రికెటర్..? ఎవరీ ర్యాన్ టెన్ డోస్చాట్..?

టీమిండియా కోచింగ్ స్టాఫ్ లో మరో క్రికెటర్ చేరనున్నట్టు తెలుస్తోంది. నెదర్లాండ్స్ మాజీ క్రికెటర్.. కేకేఆర్ ఫీల్డింగ్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చాట్‌ భారత జట్టు అసిస్టెంట్ కోచ్ గా వచ్చే అవకాశాలున్నాయి. ఇటీవలే టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ను భారత జట్టు ప్రధాన కోచ్ గా బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అదే సమయంలో తనకు ఎలాంటి కోచింగ్ స్టాఫ్ కావాలో అనే విషయంపై పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతో గంభీర్ అభిషేక్ నాయర్ ను భారత బ్యాటింగ్ కోచ్ గా..డోస్చాట్‌ ను అసిస్టెంట్ కోచ్ గా గంభీర్ సిఫార్స్ చేసినట్టు నివేదికలు చెబుతున్నాయి. 

వరల్డ్ కప్ తర్వాత భారత ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రావిడ్ తన పదవీ కాలానికి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం భారత్ 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా జింబాబ్వేలో ఉంది. కుర్రాళ్లతో నిండిన ఈ జట్టుకు శుభమాన్ గిల్ కెప్టెన్సీ చేస్తుండగా.. ప్రధాన కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ సిరీస్ తర్వాత జూలై నెలాఖరులో శ్రీలంకలో భారత్ పర్యటించనుంది. ఈ సిరీస్ నుంచి గంభీర్ భారత  ప్రధాన కోచ్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ  పర్యటనలో భారత్ మూడు వన్డేలు.. మూడు టీ20 ల సిరీస్ ఆడనుంది. 

   
ఎవరీ ర్యాన్ టెన్ డోస్చాట్..?

ర్యాన్ టెన్ డోస్చేట్ నెదర్లాండ్స్ మాజీ క్రికెటర్. 2006 నుండి 2021 వరకు అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగాడు. ఇతను దక్షిణాఫ్రికాలో జన్మించినప్పటికీ.. అతని తండ్రి నెదర్లాండ్స్ కు చెందినవాడు కావడంతో డచ్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 2011 లో భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్.. 2021 లో దుబాయ్ వేదికగా జరిగిన టీ20  వరల్డ్ కప్ లో ర్యాన్ టెన్ డోస్చేట్ నెదర్లాండ్స్ తరపున  ఆడాడు.

అంతర్జాతీయ టీ20 లీగ్ లైన బిగ్ బాష్ లీగ్.. ఐపీఎల్.. కౌంటీ ఛాంపియన్‌షిప్.. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లలో ఆడిన అనుభవం ఉంది. 33 వన్డేల్లో 1541 పరుగులు చేసాడు. ఇతని యావరేజ్ 67 గా ఉండడం విశేషం. ఇందులో 5 సెంచరీలు.. 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 24 టీ20ల్లో 41 యావరేజ్ తో 533 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన ర్యాన్ టెన్ డోస్చాట్.. 29 మ్యాచ్ ల్లో 326 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో కేకేఆర్ ఫీల్డింగ్ కోచ్ గా ఉన్నాడు.