టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంటే అగ్రెస్సివ్.. ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు కోహ్లీ అంటే కూల్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ మధ్య కోహ్లీ ప్రవర్తిస్తున్న తీరు అలాగే ఉంది. గ్రౌండ్ లో దూకుడుగా ఉంటున్నా.. వ్యక్తిగతంగా ఎవరి మీద కయ్యానికి కాలు దువ్వడం లేదు. మరోవైపు గంభీర్ అంతకు మించి అనేలా ఉంటాడు. వీరిద్దరి కలిస్తే గొడవ జరగడం ఖాయం అనేలా ఉంటుంది. జనాలు కూడా అదే ఆశిస్తారు.
ఐపీఎల్ 2024 సీజన్ లో వీరిద్దరూ కలిసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. కేకేఆర్, ఆర్సీబీ మధ్య మ్యాచ్ లో భాగంగా డ్రింక్స్ విరామంలో కోహ్లీ, గంభీర్ ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఒకరినొకరు చేతులు మీద వేసుకొని నవ్వుతూ కనిపించారు. ఏదో మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా కనిపించారు. ఈ మూమెంట్ మ్యాచ్ మొత్తానికే హైలెట్ గా మారింది. దీంతో జనాలు ఏదో ఆశిస్తే మరేదో జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా గంభీర్ వీరిద్దరి మధ్య సంబంధం గురించి హాట్ కామెంట్స్ చేశాడు.
స్పోర్ట్స్‌కీడాకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ విరాట్ కోహ్లీతో ఉన్న సంబంధం గురించి మాట్లాడాడు. "మా మధ్య ఉన్న రిలేషన్ తెలుసుకోవడానికి జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. విరాట్ కోహ్లీతో నాకున్న అనుబంధం ఈ దేశానికి తెలియాల్సిన అవసరం లేదు. అతను తన జట్టు గెలవాలని ఎలా కోరుకుంటాడో నేను అంతే కోరుకుంటాను. ప్రజలకు మసాలా ఇవ్వడానికి మేము లేము". అని గంభీర్ అన్నాడు.
ఒకప్పుడు ఎవరైనా స్లెడ్జింగ్ చేస్తే అసలు ఊరుకొని కోహ్లీ.. ఇప్పుడు తన పని తాను చేసుకుపోతున్నాడు. తనతో గొడవపడినవారిని కూడా మిత్రులుగా మార్చుకుంటున్నాడు. వరల్డ్ కప్ లో నవీన్ ఉల్ హక్ తో షేక్ హ్యాండ్ ఇవ్వడం..ఇటీవలే ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా గంభీర్ తో హగ్ జనాలకు ఆశ్చర్యాన్ని కలిగించాయి.