2027 World Cup: అలా జరిగితే రోహిత్, కోహ్లీ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతారు: గంభీర్

టీమిండియా స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్ పై అనేక సందేహాలు ఉన్నాయి. ఇటీవలే అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన వీరిద్దరూ వన్డే, టెస్ట్ ఫార్మాట్ లో కొనసాగనున్నారు. అయితే వీరు ఇప్పటివరకు ఈ రెండు ఫార్మాట్ లలో ఎప్పటివరకు కొనసాగుతారనే విషయంలో సస్పెన్స్ అలాగే ఉంది. తాజాగా వీరిద్దరి కెరీర్ పై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్, కోహ్లీ ఇద్దరూ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడతారని గ్యారంటీ ఇచ్చారు. 

శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్ లో భాగంగా టీమిండియా లంకకు త్వరలో బయలుదేరుతుంది. ఈ టూర్ లో భారత్ మూడు టీ20, మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్ ద్వారా భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ గా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో తొలి సారి గంభీర్ మీడియాతో మాట్లాడారు. ఈ మీటింగ్ లో పలు ఆసక్తికర విషయాలతో పాటు.. కోహ్లీ, రోహిత్ ల భవిష్యత్తు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   

Also Read :- ఆటో తోలుతున్న మైక్రోసాఫ్ట్ ఐటీ ఉద్యోగి

“విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరో కొన్నేళ్లు క్రికెట్ ఆడే సత్తా ఉంది. వారిద్దరిలో ఇంకా క్రికెట్ ఆడాలనే కసి ఉంది. ఏ జట్టుకైనా ఇలాంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు అవసరం. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ, ఆస్ట్రేలియా సిరీస్ ఉంది. వారి ఫిట్‌నెస్  బాగుంటే 2027 ప్రపంచ కప్ వరకు కూడా ఆడగలరు” అని గంభీర్ అన్నారు. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ బాధ్యతలు స్వీకరిస్తాడని ఇప్పుటికే  బీసీసీఐ సెక్రటరీ జైషా ఖరారు చేసిన సంగతి తెలిసిందే.