Morne Morkel: టీమిండియా బౌలింగ్ కోచ్ రేస్‌లో సౌతాఫ్రికా మాజీ పేసర్

టీమిండియా బౌలింగ్ కోచ్ విషయంలో రోజుకొక పేరు బయటకు వినిపిస్తుంది. భారత మాజీ పేసర్లు వినయ్ కుమార్, లక్ష్మీపతి బాలాజీ, జహీర్ ఖాన్ బౌలింగ్ కోచ్ రేస్ లో ఉన్నారనుకుంటే.. తాజాగా ఈ లిస్టులోకి దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ వచ్చి చేరాడు. నివేదికల ప్రకారం, ప్రధాన కోచ్ గౌతం గంభీర్ భారత బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ స్పీడ్‌స్టర్ మోర్నీ మోర్కెల్ పేరును ప్రతిపాదించారు. భారత బౌలింగ్ కోచ్‌గా వెటరన్ ప్రొటీస్ పేసర్‌ మోర్కెల్ ను నియమించాలని బీసీసీఐని అభ్యర్థించినట్లు సమాచారం. 

Also Read:ఐపీఎల్ తర్వాత అతి పెద్ద లీగ్.. బిగ్ బాష్ షెడ్యూల్ ప్రకటన

గంభీర్, మోర్కెల్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్ లో గంభీర్ రెండేళ్లపాటు లక్నో సూపర్ జెయింట్స్‌ కు మెంటార్ గా పని చేశారు. ఈ సమయంలో అతనితో లక్నో జట్టుకు మోర్నీ మోర్కెల్ బౌలింగ్ కోచ్ గా ఉన్నాడు. గంభీర్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు వచ్చేసినా సఫారీ పేసర్ మాత్రం లక్నో జట్టులో కొనసాగుతున్నాడు. 247 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో మోర్కెల్ 544 వికెట్లు పడగొట్టాడు. 2018 లో రిటైర్మెంట్ ప్రకటించిన ఈ సఫారీ పేసర్ 2023 వన్డే ప్రపంచ కప్ లో పాకిస్థాన్ బౌలింగ్ కోచ్ గా పని చేశాడు. 

కొన్ని రోజుల క్రితం బౌలింగ్ కోచ్ పదవికి కర్ణాటక మాజీ పేసర్ వినయ్ కుమార్ పేరును గౌతమ్ గంభీర్ సూచించినా.. బీసీసీఐ అతని పట్ల ఆసక్తి చూపడం లేదని మీడియా వర్గాలు తెలిపాయి. దీంతో జహీర్ ఖాన్ లేదా లక్ష్మీపతి బాలాజీలలో ఒకరికి బౌలింగ్ కోచ్ బాధ్యతలు అప్పగించనున్నట్లు బీసీసీఐ భావిస్తోన్నట్టు వార్తలు వచ్చాయి. మరి ఈ ముగ్గురిలో భారత్ కు ఎవరు బౌలింగ్ కోచ్ గా వస్తారో చూడాలి.