టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎప్పుడూ ఏదో ఒక సంచలన కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఎంతటి స్టార్ అయినా తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. వీటిలో కొన్ని నిజాలున్నప్పటికీ మరికొన్ని వివాదాలకు కారణమవుతూ ఉంటాయి. తాజాగా న్యూజిలాండ్ మాజీ ఓపెనర్, ప్రస్తుత ఇంగ్లాండ్ కోచ్ మెకల్లమ్‌కు భారత మాజీ ఓపెనర్ క్షమాపణలు చెప్పాడు.
ఐపీఎల్ 2012లో సీజన్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మాన్విన్దర్ బిస్లా 89 పరుగులు చేసి హీరోగా మారాడు. అయితే అప్పటివరకు కేకేఆర్ ఓపెనర్ గా కోల్‌కతా యాజమాన్యం మెకల్లమ్ ను గంభీర్ కు జోడీగా ఆడించారు. కానీ ఫైనల్ కు మాత్రం ఈ కివీస్ స్టార్ ను పక్కన పెట్టేసారు. గంభీర్ దీనికి అసలైన కారణం చెప్పాడు.
చెపాక్‌లో ఫైనల్‌కు బయలుదేరే ముందు జట్టు ముందు నేను బ్రెండన్ మెకల్లమ్‌కి సారీ చెప్పాను. మిమ్మల్ని డ్రాప్ చేయవలసి వచ్చినందుకు నన్ను క్షమించండి. బాలాజీ గాయపడటం వలన జట్టు కూర్పులో ఫైనల్ లో మార్పు చేయాల్సి వచ్చింది. దీంతో మెకల్లమ్ స్థానంలో ఒక విదేశీ బౌలర్ ను ఆడించాల్సి వచ్చింది. వికెట్ కీపర్ గా ఒక భారత ప్లేయర్ ను పక్కన పెట్టి బిస్లాను తీసుకున్నాం. టోర్నమెంట్ మొత్తం ఆడి ఫైనల్‌కి బెంచ్ పై కూర్చోపెట్టడం ఎవరికైనా బాధగానే ఉంటుంది. అందుకే జట్టు ముందు అతనికి క్షమాపణ చెప్పే ధైర్యం వచ్చింది. మనం తప్పు చేయునప్పుడు ధైర్యంగా క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు.అని గంభీర్ అన్నాడు.