Cricket World Cup 2023: కలిసిపోయిన కోహ్లీ-నవీన్ ఉల్ హక్.. హక్కుల గురుంచి గంభీర్ లెక్చర్

Cricket World Cup 2023: కలిసిపోయిన కోహ్లీ-నవీన్ ఉల్ హక్.. హక్కుల గురుంచి గంభీర్ లెక్చర్

ఢిల్లీ వేదికగా భారత్ - అఫ్ఘానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకున్న విషయం విదితమే. బద్ధ శత్రువులుగా పేరొందిన భారత ఆటగాడు విరాట్ కోహ్లీ, ఆఫ్ఘన్ బౌలర్ నవీన్ ఉల్ హక్ కలిసిపోయారు. ఒకరికొకరు కరచాలనం చేసుకుని, చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆ దృశ్యాలు అభిమానులను ఎంతో ఆశ్చర్యపరిచాయి. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచాయి.

అభిమానులకు కోహ్లీ సైగలు

అంతకుందు ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ నవీన్ ఉల్ హక్ బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో అతడిని ఉద్దేశించి ప్రేక్షకులు కామెంట్లు చేశారు. కోహ్లీ.. కోహ్లీ అని అరుస్తూ అతన్ని ఆట పట్టించారు. వెంటనే కోహ్లీ.. అతన్ని ఏమి అనకూడదని సైగలతో అభిమానులకు సూచించాడు. దాంతో వారు శాంతించారు. అనంతరం నవీన్ ఉల్ హక్.. కోహ్లీ దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకున్నాడు. ఆ సమయంలో ఈ గొడవను ఇక్కడితో ఆపేద్దామని కోహ్లీ కోరగా.. నవీన్ ఉల్ హక్ అందుకు అంగీకరించాడు. అనంతరం నవ్వుతూ ఇద్దరూ హగ్ చేసుకున్నారు.

హక్కుల గురుంచి గంభీర్ లెక్చర్

ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన గంభీర్.. కోహ్లీ-నవీన్ ఉల్ హక్ మధ్య విబేధాలు సమిసిపోవడం పట్ల ఆనందంతో ఎగిరి గంతేశాడు. పరోక్షంగా నవీన్ ఉల్ హక్ ను మెచ్చుకునేలా హక్కుల గురుంచి లెక్చర్ ఇచ్చాడు. "ఏ ఆటగాడైనా మైదానంలోనే పోరాడాలి.. మైదానం బయట కాదు.. ప్రతి ఆటగాడికి తమ జట్టు కోసం, తన గౌరవం కోసం పోరాడే హక్కు ఉంటుంది. ఈ విషయంలో ఏ దేశానికి చెందినవారు.. ఎంత మంచి ఆటగాడు అన్నది ముఖ్యం కాదు.." అని గంభీర్ వ్యాఖ్యానించాడు. 

అలాగే, వీరు కలిసిపోవడంటంపై స్పందించిన గంభీర్.. ఆ సన్నివేశాలు చూడటం చాలా బాగుందని తెలిపాడు. "ఇంతటితో ఐపీఎల్ గొడవకు ముగింపు పడినట్లే. అలాగే, అభిమానులకు ఓ విజ్ఞప్తి చేస్తున్నా.. మైదానంలోని కానీ, సోషల్ మీడియాలో కానీ ఏ ఆటగాడినైనా ట్రోలింగ్ చేయడం, ఎగతాళి చేయడం వంటివి చేయకూడదని కోరుతున్నా.. మీరు మీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఉద్వేగభరితంగా ఉంటారు. జాతీయ జట్టు తరఫున ఆడాలన్నది ప్రతి క్రికెటర్‌ కల. అందుకోసం వారు ఎంతో శ్రమించి ఇక్కడి వరకు వస్తారు. ఆఫ్ఘన్‌ జట్టు నుంచి తొలిసారిగా ఐపీఎల్‌లో ఆడడం నవీన్‌కు చాలా గొప్ప విషయం.." అని గంభీర్ చాలా ఎమోషనల్ కామెంట్రీ ఇచ్చాడు.

రోహిత్ శర్మ విధ్వంసం

ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే రోహిత్ శర్మ(131) విధ్వంసకర సెంచరీతో అఫ్ఘానిస్థాన్‌పై టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఫ్ఘన్ జట్టు నిర్ధేశించిన 273 పరుగుల లక్ష్యాన్ని మరో 15 ఓవర్లు మిగిలివుండగానే ఛేదించింది.

ALSO READ : టార్గెట్ కాంగ్రెస్... ప్రగతి భవన్లో ఆరు వార్ రూంలు