Gautam Gambhir: ప్రేక్షకులకు మసాలా అందించడం మా పని కాదు: కోహ్లీతో రిలేషన్‌పై గంభీర్

Gautam Gambhir: ప్రేక్షకులకు మసాలా అందించడం మా పని కాదు: కోహ్లీతో రిలేషన్‌పై గంభీర్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంటే అగ్రెస్సివ్.. ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు కోహ్లీ అంటే కూల్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ మధ్య కోహ్లీ ప్రవర్తిస్తున్న తీరు అలాగే ఉంది. గ్రౌండ్ లో దూకుడుగా ఉంటున్నా.. వ్యక్తిగతంగా ఎవరి మీద కయ్యానికి కాలు దువ్వడం లేదు. మరోవైపు గంభీర్ అంతకు మించి అనేలా ఉంటాడు. వీరిద్దరి కలిస్తే గొడవ జరగడం ఖాయం అనేలా ఉంటుంది. జనాలు కూడా అదే ఆశిస్తారు. ఐపీఎల్ లో పలుమార్లు కోహ్లీ, గంభీర్ గొడవపడుతూ కనిపించారు.    

ఐపీఎల్ 2024 సీజన్ లో వీరిద్దరూ కలిసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. కేకేఆర్, ఆర్సీబీ మధ్య మ్యాచ్ లో భాగంగా డ్రింక్స్ విరామంలో కోహ్లీ, గంభీర్ ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఒకరినొకరు చేతులు మీద వేసుకొని నవ్వుతూ కనిపించారు. అప్పటినుంచి కోహ్లీ, గంభీర్ ఎంతో పరిణితి చెందిన ఆటగాళ్లలా ఎంతో హుందాగా నడుచుకుంటున్నారు. తాజాగా కోహ్లీతో రిలేషన్ షిప్ పై గంభీర్ మరోసారి స్పందించాడు. 

టీమిండియా శ్రీలంక టూర్‌కు వెళ్తున్న నేప‌థ్యంలో ఇవాళ ముంబైలో చీఫ్ కోచ్ గంభీర్‌, చీఫ్ సెలెక్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా కోహ్లీపై తనకున్న రిలేషన్ షిప్ పై స్పందించారు. "మా ఇద్దరి మధ్య రిలేష‌న్ ఇద్ద‌రు వ్య‌క్త‌ల మ‌ధ్య ఉంటుంది కానీ అది టీఆర్పీల కోసం కాదు. కోహ్లీతో నాకు ఎలాంటి విబేధాలు లేవు. 140 కోట్ల మంది భార‌తీయుల‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ఫీల్డ్‌లో కోహ్లీతో మంచి రిలేష‌న్ కొనసాగుతుంది". అని గంభీర్ అన్నారు.