IND vs NZ 2nd Test: ఐపీఎల్ అంత సింపుల్ కాదు: భారత జట్టును నడిపించలేకపోతున్న గంభీర్

IND vs NZ 2nd Test: ఐపీఎల్ అంత సింపుల్ కాదు: భారత జట్టును నడిపించలేకపోతున్న గంభీర్

రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్ గా భారత జట్టును ముందుండి నడిపించాడు. తన పదవీ కాలంలో కొన్ని ఐసీసీ టోర్నీలు మిస్ అయినప్పటికీ కోచ్ గా జట్టుకు గొప్ప విజయాలను అందించాడు.  ఈ ఏడాది భారత్ కు టీ20 వరల్డ్ కప్ అందించి గౌరవంగా కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. దీంతో ద్రవిడ్ స్థానంలో బీసీసీఐ గౌతమ్ గంభీర్ ను ప్రధాన కోచ్ గా నియమించింది. అనుభవం లేకోపోయినా బీసీసీఐ గంభీర్ ను గుడ్డిగా నమ్మినట్టు తెలుస్తుంది.

గంభీర్‌కు గతంలో ఎలాంటి కోచింగ్ అనుభవం లేనప్పటికీ, ఐపీఎల్ టోర్నీలో పలు జట్లకు మెంటార్‌గా వ్యవహరించారు. ఈ ఏడాది తన శిక్షణలో కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టును విజేతగా నిలిపారు. మాజీ ఓపెనర్‌కున్న ఈ అనుభవం భారత జట్టును సమర్థవంతంగా నడిపించగలడని భావించి బీసీసీఐ అతన్ని ప్రధాన కోచ్ గా చేసింది. ప్రధాన కోచ్ గా గంభీర్ కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. అతనికి నచ్చినట సహాయక కోచ్ లను నియమించింది. అయితే మూడు నెలలు గడిచేసరికి గంభీర్ కు అన్ని చేదు అనుభవాలే.
 

శ్రీలంకపై వన్డే సిరీస్ ను 0-2 తో భారత జట్టును కోల్పోయింది. 28 ఎలా తర్వాత భారత గడ్డపై లంక సిరీస్ గెలుచుకొని సంచలనం సృష్టించింది. ఒకరకంగా చెప్పాలంటే శ్రీలంక-బి జట్టుతో ఓడిపోయింది. గాయం కారణంగా ఈ సిరీస్ కు హసారంగా, తీక్షణ, చమీర, నువాన్ ఫెర్నాండో, బినురా ఫెర్నాండో దూరమయ్యారు. మరోవైపు భారత జట్టు పూర్తి స్థాయి జట్టుతో ఆడింది. 

ఈ సిరీస్ తర్వాత పసికూన బంగ్లాదేశ్ పై ప్రతాపం చూపించారు. 2-0 తేడాతో స్వదేశంలో టెస్ట్ సిరీస్ గెలిచారు. ఇది ఊహించిందే అయినా..స్వదేశంలో 12 ఏళ్లుగా ప్రత్యర్థిని వణికిస్తూ ఒక్క సిరీస్ ఓడిపోకుండా విజయాలు సాధిస్తూ వచ్చిన టీమిండియాకు న్యూజిలాండ్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మరో టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ పై 2-0 తేడాతో సిరీస్ ను సొంతం చేసుకుంది. 

బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో గెలిచి భారత్ కు షాక్ ఇచ్చిన న్యూజిలాండ్.. పూణే టెస్టులోనూ భారీ విజయాన్ని సొంతం చేసుకొని మ్యాచ్ తో పాటు సిరీస్ కైవసం చేసుకుంది.  దీంతో 12 ఏళ్ళ తర్వాత భారత్ స్వదేశంలో తొలిసారి టెస్ట్ సిరీస్ కోల్పోయింది. కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియంసన్ లేకుండానే సిరీస్ గెలిచింది.                             

తాజాగా న్యూజిలాండ్ పై మన జట్టు టెస్ట్ సిరీస్ ఓడిపోవడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీలంకతో 0-2 తేడాతో టెస్ట్ సిరీస్ ఓడిపోయిన న్యూజిలాండ్.. టీమిండియాపై సింపుల్ గా మన గడ్డపై టెస్ట్ గెలిచింది. దీంతో గంభీర్ పై నెటిజన్స్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. గంభీర్ ను బీసీసీఐ గుడ్డిగా నమ్మిందని.. అతను కోచ్ గా పనికి రాడని మండిపడుతున్నారు. మరికొందరు ఐపీఎల్ నడిపించినంత సింపుల్ కాదు భారత జట్టును ముందుకు తీసుకెళ్ళడమంటే అని సెటైర్లు విసురుతున్నారు.