ఖమ్మం టౌన్,వెలుగు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సూచించారు. శనివారం కలెక్టర్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్, సీఆర్పీఎఫ్ కమాండెంట్ ధరమ్ వీర్ జాఖర్ లతో కలిసి సర్దార్ పటేల్ స్టేడియంలో హోంమంత్రి పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పర్యటన పూర్తయ్యేవరకు సంబంధిత అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సన్నద్ధం అవ్వాలన్నారు.
అనంతరం కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడు, ముదిగొండ మండలం వెంకటాపురం, ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల అర్బన్ పార్క్, కైకొండాయిగూడెం ఇండస్ట్రియల్ కాలనీల్లో కలెక్టర్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తో కలిసి మొక్కలు నాటారు. తరువాత రఘునాథపాలెం మండలం వి. వెంకటాయపాలెం లో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. 5వ ఫౌండేషన్ కోర్స్ లో భాగంగా జిల్లాకు వచ్చిన మిలిటరీ ఇంజనీరింగ్ అధికారులు విలేజ్ స్టడీ మాడ్యూల్ అనంతరం కలెక్టరేట్ లో కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం, కామెపల్లి మండలం కొమినేపల్లి, తల్లాడ మండలం కుర్ణవెళ్లి, కల్లూరు మండలం ముచారం గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై స్టడీ చేసినట్లు వారు కలెక్టర్ కు తెలిపారు.
నేడు అమిత్ షా పర్యటన
ఖమ్మం, వెలుగు: ఖమ్మంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనకు బీజేపీ నేతలు ఏర్పాటు పూర్తి చేశారు. ఎస్ ఆర్ అండ్ బీజీఎన్ ఆర్ కాలేజీ గ్రౌండ్ లో ఇవాళ మధ్యాహ్నం 3:30 కు సభ ప్రారంభం కానుంది. ఢిల్లీ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో అమిత్ షా మధ్యాహ్నం 12:30 కు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2.50కి విజయవాడ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. భద్రాద్రి పర్యటన రద్దు కావడంతో విజయవాడ నుంచి నేరుగా హెలికాప్టర్ లో ఖమ్మం రానున్నారు. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5:45 వరకు ఆయన ఖమ్మంలో ఉంటారు. బహిరంగ సభ తర్వాత హెలికాప్టర్ లో విజయవాడకు , అక్కడినుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ తిరిగి వెళ్లనున్నారు.