గాయత్రి–ట్రీసా జోడీ ఓటమి

 గాయత్రి–ట్రీసా జోడీ ఓటమి

హాంగ్జౌ: ఇండియా డబుల్స్‌‌ షట్లర్లు పుల్లెల గాయత్రి– ట్రీసా జాలీ  బీడబ్ల్యూఎఫ్‌‌ వరల్డ్‌‌ టూర్‌‌ ఫైనల్స్‌‌ టోర్నమెంట్‌‌లో శుభారంభం చేయలేకపోయారు. బుధవారం జరిగిన గ్రూప్‌‌–ఎలో తొలి మ్యాచ్‌‌లో ట్రీసా–గాయత్రి 20–22, 22–20, 14–21తో వరల్డ్ నంబర్‌‌ వన్‌‌ లియు షెంగ్‌‌ షు–టాన్ నింగ్‌‌ (చైనా) చేతిలో ఓడారు.  

తొలి గేమ్‌‌లో 8–13తో వెనకబడ్డ ఇండియా షట్లర్లు కీలక టైమ్‌‌లో వరుసగా పాయింట్లు నెగ్గి 19–19తో స్కోరు సమం చేసినా గేమ్‌‌ను చేజార్చుకున్నారు. రెండో గేమ్‌‌లో దూకుడుగా ఆడిన ట్రీసా–గాయత్రి 12–17తో వెనుకంజ వేసినా 18–18తో స్కోరు సమం చేసి గేమ్‌‌ నెగ్గారు. కానీ, చివరి గేమ్‌‌లో తమ అనుభవాన్ని ఉపయోగించిన షెంగ్–టాన్‌‌ 11–5 లీడ్‌‌లోకి వెళ్లారు. క్రమంగా పుంజుకున్న ఇండియా జోడీ  13–15తో ఆధిక్యాన్ని తగ్గించినా గేమ్‌‌ను గెలిచే పాయింట్లు సాధించలేకపోయింది.