గాజాను టేకోవర్ చేస్కుంటం.. సొంతం చేస్కుని డెవలప్ చేస్తం: ట్రంప్

గాజాను టేకోవర్ చేస్కుంటం.. సొంతం చేస్కుని డెవలప్ చేస్తం: ట్రంప్
  • పాలస్తీనియులను అక్కడి నుంచి శాశ్వతంగా సాగనంపుతం
  • నెతన్యాహుతో భేటీ తర్వాత జాయింట్ ప్రెస్​మీట్​లో వెల్లడి

వాషింగ్టన్ డీసీ: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బుధవారం సంచలన కామెంట్స్ చేశారు. ఇజ్రాయెల్ దాడిలో శిథిలాల కుప్పగా మారిన గాజా స్ట్రిప్​ను అమెరికా సొంతం చేస్కుంటుందని, ఆ ప్రాంతాన్ని ‘క్లీన్’ చేసి ప్రపంచం ఆశ్చర్యపోయేరీతిలో అభివృద్ధి చేస్తుందని చెప్పారు. అయితే, గాజా నుంచి ఇప్పటికే వలస వెళ్లిపోయిన వారితో పాటు ఇంకా అక్కడే ఉన్న పాలస్తీనీయులు శాశ్వతంగా ఆ భూభాగాన్ని వదిలిపెట్టాల్సి ఉంటుందని ట్రంప్ అన్నారు. 

పాలస్తీనీయులంతా వెళ్లిపోయాక గాజాను సుదీర్ఘకాలం పాటు సొంతం చేసుకుని అభివృద్ధి పనులు మొదలుపెడతామని చెప్పారు. అక్కడి మందుపాతరలను తొలగించి, శిథిల భవనాలను పూర్తిగా నేలమట్టం చేస్తామని తెలిపారు. ఈమేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కలిసి పాల్గొన్న జాయింట్ ప్రెస్ మీట్​లో ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు. 

అమెరికా బలగాలను గాజాకు పంపిస్తారా అని మీడియా ప్రశ్నించగా.. గాజా పునర్నిర్మాణానికి అవసరమైన ప్రతీ ఒక్కటీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రపంచం అవాక్కయ్యేలా గాజాను తీర్చిదిద్దుతామని తెలిపారు. పశ్చిమాసియాకు గాజాను గర్వకారణంగా అభివృద్ధి చేస్తామన్నారు. కాగా, ట్రంప్​ మాటలకు నెతన్యాహు వంతపాడారు. ట్రంప్ ఆలోచనను ‘ఔటాఫ్​ ది బాక్స్ థింకింగ్’ అని అన్నారు. గాజా చరిత్రను మార్చే నిర్ణయమని ప్రశంసించారు. ట్రంప్ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేగింది. పశ్చిమాసియా రాజకీయాల్లో ఈ నిర్ణయం పెను ప్రభావం చూపనుందని విశ్లేషకులు చెబుతున్నారు. 

2023 లో యుద్ధం..

గాజా సరిహద్దుల్లో ఇజ్రాయెల్ భూభాగంలో జరుగుతున్న పార్టీపై హమాస్ మిలిటెంట్లు దాడి చేశారు. కాల్పులు జరిపి వందలాది మందిని బలితీసుకున్నారు. దాదాపు 200 మందిని బంధీలుగా పట్టుకుని తీసుకెళ్లారు. ఈ మారణహోమంపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. గాజాపై యుద్ధం ప్రకటించింది. హమాస్​ను మట్టుబెట్టే వరకు యుద్ధం విరమించేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. గాజా స్ట్రిప్ పై మిసైళ్ల వాన కురిపిస్తూ చాలా భూభాగాన్ని  శిథిలాల దిబ్బగా మార్చింది. దీంతో ఏడాదిగా గాజాలో కొనసాగుతున్న యుద్ధం హమాస్ తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో ఆగింది. 

గాజా స్ట్రిప్​ను మేం టేకోవర్ చేస్కుంటం.. అక్కడ ప్రమాదకరంగా ఉన్న బాంబులను నిర్వీర్యం చేయడంతో పాటు ఇతరత్రా ఆయుధాలను తొలగించే బాధ్యత మాదే.  గాజాను పునర్నిర్మించి, ఆర్థికంగా అభివృద్ధి చేసి వేలాది ఉద్యోగాలను సృష్టిస్తం. 
- డోనాల్డ్ ​ట్రంప్, యూఎస్ ప్రెసిడెంట్