![మార్చురీలు, శ్మశానాలు ఫుల్.. ఐస్ క్రీమ్ ట్రక్కుల్లో డెడ్‌బాడీలు](https://static.v6velugu.com/uploads/2023/10/gaza-facing-dire-conditions-d_df1K6Dh9FC.jpg)
- గాజాలో దయనీయ పరిస్థితి
- సామూహిక ఖననాలకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
- ఆహారం, నీరు, మందులకు కొరత
- నిత్యావసరాలతో రఫా పాయింట్ వద్ద ట్రక్కులు వెయిటింగ్
హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ చేస్తున్న రాకెట్ దాడులతో గాజా దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఓవైపు ఆహారం, నీరు, మెడిసిన్ల కొరత తీవ్రం కాగా.. మరోవైపు వేలాది మంది పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందించలేని స్థితికి ఆసుపత్రులు చేరుకున్నాయి. ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో రోజూ వందలాది మంది చనిపోతుండగా.. డెడ్‌బాడీలను భద్రపర్చేందుకు చోటు సరిపోవడం లేదు. ఆసుపత్రుల్లో మార్చురీలు నిండిపోగా.. ఖననం చేసేందుకు శ్మశానాల్లోనూ స్థలం లేనంత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఐస్ క్రీమ్ ట్రక్కులనే మార్చురీలుగా వాడుకుంటున్నారు. ఈ ట్రక్కులు కూడా సరిపోకపోవడంతో పదుల సంఖ్యలో డెడ్‌బాడీలను టెంట్ల కింద ఉంచుతున్నారు. ఇక, వారం రోజుల్లో దాదాపు 10 లక్షల మంది గాజా స్ట్రిప్ నుంచి వెళ్లిపోయారు.
జెరూసలెం/రఫా/ఖాన్ యూనిస్ : హమాస్, ఇజ్రాయెల్ మధ్య పోరులో చిక్కుకున్న గాజా.. నిలువెల్లా గాయాలతో రక్తమోడుతున్నది. రాకెట్ దాడులతో ఛిద్రమై శిథిలదేశంగా మారుతున్నది. ఆహారం, నీళ్లు, మెడిసిన్లు లేక అల్లాడుతున్నది. రోజూ పదుల సంఖ్యలో చనిపోతుండటంతో డెడ్‌బాడీలతో మార్చురీలన్నీ నిండిపోయాయి. అక్కడ ఖాళీ ఉండటం లేదు. ఖననం చేద్దామంటే శ్మశానాల్లోనూ చోటు దొరకట్లేదు. దీంతో చేసేదేంలేక డెడ్‌బాడీలను భద్రపరిచేందుకు ఐస్‌క్రీమ్ ట్రక్కులను ఉపయోగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆసుపత్రి బయట ఐస్‌క్రీమ్ ట్రక్కులు నిలబడి ఉండటం ఆ వీడియోల్లో కనిపించింది.
‘‘ఆసుపత్రి మార్చురీలో కేవలం 10 డెడ్‌బాడీలను స్టోర్ చేసేందుకు మాత్రమే అవకాశం ఉంది. దీంతో వాటిని భద్రపరిచేందుకు ఐస్‌క్రీమ్ ఫ్యాక్టరీల నుంచి ఐస్‌క్రీమ్ ఫ్రీజర్లను తెప్పిస్తున్నాం” అని డైర్ అల్‌బలాలలోని షుహదా అల్ అఖ్సా ఆసుపత్రి డాక్టర్ యాసిర్ అలీ చెప్పారు. అయినప్పటికీ అవికూడా సరిపోవడం లేదని, 20 నుంచి 30 డెడ్‌బాడీలను టెంట్లలో ఉంచామని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే సామూహిక అంత్యక్రియలు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మూడు రోజుల్లో 6 లక్షల మంది తరలింపు
రెండు వైపులా యుద్ధం మొదలైనప్పటి నుంచి 2,750 మంది పాలస్తీనియన్లు చనిపోయారని గాజా హెల్త్ మినిస్ట్రీ చెప్పింది. 9,700 మంది గాయపడ్డారని తెలిపింది. మరోవైపు 1,400 మందికి పైగా ఇజ్రాయెలీలు చనిపోయారు. మూడు రోజుల్లో గాజా సిటీ నుంచి 6 లక్షల మందిని తరలించినట్లు చెప్పింది.
కాల్పుల విరమణకు మేం ఒప్పుకోలే : ఇజ్రాయెల్
పాలస్తీనియన్లు రఫా బార్డర్ దాటి ఈజిప్టులోకి వెళ్లేందుకు.. కాల్పుల విరమణకు తాము ఒప్పుకున్నామంటూ వచ్చిన వార్తలను ఇజ్రాయెల్ ఖండించింది. తాము ఎలాంటి కాల్పుల విరమణ ఒప్పందానికి ఓకే చెప్పలేదని ప్రధాని నెతన్యాహు కార్యాలయం స్పష్టం చేసింది.
బందీలుగా 199 మంది ఇజ్రాయెలీలు
పాలస్తీనాకు చెందిన హమాస్ టెర్రరిస్టుల ఆధీనంలో తమ దేశానికి చెందిన 199 మంది బందీలుగా ఉన్నట్లు ఇజ్రాయెల్ మిలటరీ ప్రకటించింది. బందీలుగా ఉన్నవారి సంఖ్యను తొలుత 155 గా పేర్కొన్న ఇజ్రాయెల్ అధికారులు తాజాగా ఆ సంఖ్యను సవరించారు.
హమాస్ వాడినవన్నీ ‘హోమ్‌మేడ్’ ఆయుధాలే
ఇజ్రాయెలీలను చంపేందుకు హమాస్ వాడిన ఆయుధాలు ఇవేనంటూ ఓ వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) రిలీజ్ చేసింది. ట్విట్టర్‌లో షేర్ చేసిన ఆ వీడియోలో.. రాకెట్లు, గ్రనేడ్లు, మెడికల్ సప్లైస్, ఆహారం వంటివి కనిపించాయి. ‘‘హమాస్ మిలిటెంట్లు వాడిన ఆయుధాల్లో ఇవి 20% మాత్రమే. వాటిపై ఉన్న సింబల్స్‌ను మీరు గమనించవచ్చు. ఇవన్నీ హమాస్ తయారు చేసినవే. హోమ్‌మేడ్ ప్రొడక్టులు. మరిన్ని దాడులు జరగకుండా అడ్డుకునేందుకు.. హమాస్ టెర్రరిస్టు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను, వెపన్ మాన్యుఫ్యాక్చరర్లను నిర్మూలిస్తాం” అని ఐడీఎఫ్ పేర్కొంది.
చంపుతూ వీడియో తీస్తూ..
ఇజ్రాయెల్‌లో చొరబడిన హమాస్ మిలిటెంట్లు.. కనిపించిన ప్రతి పౌరుడినీ చంపుకుంటూ, దాన్ని వీడియో తీస్తూ ముందుకెళ్లిన విజువల్స్‌ను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సోమవారం విడుదల చేసింది. ఇందులో కొంతమంది మిలిటెంట్లు గన్స్‌తో కాల్పులు జరుపుకుంటూ పోతున్నారు. వెనకాలే మరో మిలిటెంట్ వీడియో తీస్తూ ఫాలో అయ్యాడు. ఒకచోట ఇజ్రాయెల్ భద్రతా దళాలు ఎదురుపడి కాల్పులు జరపడంతో ముందున్న మిలిటెంట్ కుప్పకూలాడు. ఏంజరిగిందో తెలిసే లోపే రెండో మిలిటెంట్ శరీరంలోకి బుల్లెట్లు దిగాయి. ఈ విజువల్స్ కూడా కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో మిలిటెంట్లు వారి చావును వారే వీడియో తీసుకున్నట్లైంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఆసుపత్రులు, స్కూళ్లల్లో షెల్టర్
వారం రోజుల్లో దాదాపు 10 లక్షల మంది గాజా స్ట్రిప్ నుంచి వెళ్లిపోయారు. ఇంకా సిటీలో ఉన్న పాలస్తీనియన్లు షెల్టర్ కోసం ఆసుపత్రులు, స్కూళ్లకుపోటెత్తుతున్నారు. ‘‘5 లక్షల మంది ప్రజలు యూఎన్ స్కూళ్లు, ఇతర సముదాయా ల్లో ఉంటున్నారు. అక్కడ నీళ్లు అయిపోతున్నా యి. గాజా ఎండిపోతున్నది” అని యూఎన్ పాలస్తీనా రెఫ్యూజీ ఏజెన్సీ అధికార ప్రతినిధి జూలియట్ టౌమా ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారం, నీటి కొరత రోజురోజుకూ పెరిగిపోతున్నది. నీరు, ఆహారం, మెడిసిన్ సప్లై లేక గాజాలోని ప్రజలు అలమటిస్తున్నారు. రఫా పాయింట్ వద్ద నిత్యావసరాలతో నిండిన ట్రక్కులు కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్నాయి.
ఈజిప్టును, గాజాను కలిపే రఫా పాయింట్‌ను ఇజ్రాయెల్ గత వారంలోనే మూసేసింది. దీంతో గాజాలోనికి ఈ ట్రక్కులు వెళ్లేందుకు వీలు పడటం లేదు. కాల్పుల విరమణ కోసం ఎంతో మంది కోరుతున్నా.. అది సాధ్యపడటం లేదు. రఫా పాయింట్‌ను ఓపెన్ చేయాలన్న తమ విజ్ఞప్తిపై ఇజ్రాయెల్ ప్రభుత్వం స్పందించడం లేదని ఈజిప్టు ఫారిన్ మినిస్టర్ చెప్పారు.
24 గంటల్లో జనరేటర్లు ఆగిపోతయ్
గాజా ఆసుపత్రుల్లోని జనరేటర్లకు ఇంధనం లేదని, అవి మరో 24 గంటల్లో ఆగిపోతాయని తెలుస్తున్నది. దీంతో వేలాది మంది పేషెంట్ల ప్రాణాలు ప్రమాదంలో పడుతాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ‘‘రక్షణ కోసం ఆసుపత్రులకు ఇప్పటికే జనం పోటెత్తుతున్నారు. పారిశుధ్యం సరిగ్గా లేకపోవడం, నీటి కొరత, ఒకే సారి చాలా మంది తరలి రావడంతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. నార్త్ గాజాలోని నాలుగు ఆసుపత్రులు పని చేయడం లేదు.
మరో 21 ఆసుపత్రుల నుంచి వెళ్లిపోవాలంటూ ఇజ్రాయెల్ ఆదేశాలిచ్చింది. కానీ డాక్టర్లు అందుకు నిరాకరించారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న పేషెంట్లు, నవజాత శిశువులు చనిపోతారని చెప్పారు” అని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. దాదాపు 300,000 మంది రోగులు.. ప్రస్తుతం రఫా ఎంట్రన్స్ వద్ద ఎదురు చూస్తున్నారని చెప్పింది.