మున్సిపాలిటీల ఏర్పాటుపై గెజిట్ రిలీజ్.. త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్న సర్కార్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఏర్పాటు, శివారు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో కలుపుతూ ప్రభుత్వం పంపిన బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. అందుకు అనుగుణంగా లా సెక్రటరీ తిరుపతి గెజిట్ రిలీజ్ చేశారు. ఈ కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయన్న వివరాలతో  మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలు నోటిఫికేషన్ ఇవ్వనున్నాయి. ప్రస్తుతం మున్సిపాలిటీలుగా ఉన్న మహబూబ్‌‌‌‌నగర్, మంచిర్యాలను కార్పొరేషన్లుగా అప్‌‌‌‌గ్రేడ్‌‌‌‌ చేశారు.

దీంతో మొత్తం కార్పొరేషన్ల సంఖ్య 15కు పెరిగింది. మహబూబాబాద్‌‌‌‌ జిల్లా కేసముద్రం, జనగామ జిల్లా స్టేషన్‌‌‌‌ఘన్‌‌‌‌పూర్, సంగారెడ్డి జిల్లా కోహిర్, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్, నారాయణపేట జిల్లా మద్దూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, ఖమ్మం జిల్లా ఏదులాపురం, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లా దేవరకద్ర, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌‌‌‌, చేవెళ్లను మున్సిపాలిటీలుగా మార్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల సంఖ్య 153కు పెరిగింది. పరిగి మున్సిపాలిటీలోని 6 గ్రామాలు, నర్సంపేటలోని 7 గ్రామాలు, శంషాబాద్‌‌‌‌, నార్సింగిలోని ఒక్కో గ్రామాన్ని మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌లో.. కరీంనగర్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ పరిధిలోని 6 గ్రామాలను మంచిర్యాలలో విలీనం చేశారు.