భద్రాచలం, వెలుగు : గిరిజన సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలకు నిత్యావసరాలు, కాస్మోటిక్స్ అన్నీ తనిఖీ చేయాలని, క్వాలిటీ సరుకులనే సరఫరా చేయాలని జీసీసీ సీజీఎం సీతారాంనాయక్ జీసీసీ గోడౌన్ మేనేజర్లను ఆదేశించారు. శనివారం భద్రాచలంలోని గిరిజన గురుకుల బాలికల కాలేజీని ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఐటీడీఏ ఆఫీసులో జీసీసీ స్టాఫ్‌తో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో మాట్లాడారు. హాస్టళ్లు, ఆశ్రమాలు, గురుకులాల నుంచి వచ్చిన ఇండెంట్ ప్రకారం సరుకులు పంపించాలన్నారు.
రాష్ట్రంలో పెరుగుతున్న ఫుడ్ పాయిజన్ కేసుల నేపథ్యంలో అందరూ అలర్ట్ గా ఉండాలని చెప్పారు. హెచ్ఎంలు, వార్డెన్లు, ప్రిన్సిపాళ్ల నుంచి ఎన్వోసీ రిపోర్టులు తీసుకోవాలన్నారు. గోడౌన్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రతీదీ రికార్డెడ్‌గా ఉండాలన్నారు. సివిల్ సప్లయ్ ద్వారా వచ్చే బియ్యం నాణ్యతను తనిఖీ చేయాలని చెప్పారు. అటవీ ఉత్పత్తులు దళారీల బారిన పడకుండా, నేరుగా జీసీసీకే తెచ్చి అమ్ముకునేలా చూడాలన్నారు. సరుకుల్లో నాణ్యత లేదని ఫిర్యాదులు వస్తే స్టాఫ్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జీసీసీ డీఎం సమ్మయ్య, మేనేజర్లు లక్ష్మోజీ, నర్సింహారావు, జయరాజ్, పాపారావు, లక్ష్మణరావు తదితరులు ఉన్నారు.