- స్టోవింగ్ చేయకపోవడంతో పొంచిఉన్న ప్రమాదం
- ఎల్‌ఈపీ గనిలో 1993 నుంచి 2021 వరకు తవ్వకాలు
- పక్కనున్న ఓపెన్‌కాస్ట్‌ల్లో బ్లాస్టింగ్‌లతో కూలుతున్న మైన్ పైకప్పులు
- నివాస ప్రాంతాలకు ముప్పు తప్పదంటున్న నిపుణులు
- పట్టించుకోని మేనేజ్‌మెంట్.. ఆందోళనలో ప్రజలు
గోదావరిఖని, వెలుగు: సింగరేణి రామగుండం రీజియన్ పరిధి ఆర్జీ 2 డివిజన్‌లోని జీడీకే 7 ఎల్‌ఈపీ అండర్ గ్రౌండ్ మైన్‌లో పెద్దఎత్తున బొగ్గు తవ్వకాలు చేపట్టారు. బొగ్గు వెలికితీయగా ఏర్పడిన ఖాళీ ప్రదేశంలో భూమి కుంగకుండా ఇసుక లేదంటే బూడిద నింపాల్సి ఉండగా మేనేజ్‌మెంట్ పట్టించుకోవడం లేదు. దీంతో ఆ ఏరియా డేంజర్ జోన్‌లో ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భూమిపై నుంచి కేవలం 30 మీటర్ల లోతులోనే బొగ్గు వెలికితీయడంతో నివాస ప్రాంతాలకు ముప్పు తప్పదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పక్కనున్న రెండు ఓపెన్‌కాస్ట్ గనుల్లో బ్లాస్టింగ్‌లతో అండర్‌గ్రౌండ్ మైన్‌లో కదలికలు వస్తున్నాయని పలువురు కార్మికులు చెబుతున్నారు. ఈ విషయమై కార్మిక సంఘాలు మేనేజ్మెంట్దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.
సంస్థలున్న వైపు నింపారు.. నివాస ప్రాంతాలను మరిచారు
సింగరేణి రామగుండం రీజియన్‌లోని జీడీకే 7 ఎల్‌ఈపీ (లైఫ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్) అండర్‌గ్రౌండ్ మైన్‌లో 1993 జూన్‌లో బొగ్గు ఉత్పత్తి మొదలు పెట్టి 2021 నవంబర్‌లో నిలిపివేశారు. ఈ గనిలో మొత్తం 57 లక్షల టన్నుల బొగ్గు నిల్వలున్నట్టు గుర్తించి 48 లక్షల టన్నుల బొగ్గును వెలికితీశారు. ఇంకా 9 లక్షల టన్నుల నిల్వలు మిగిలి ఉండగానే ఉత్పత్తిని నిలిపేశారు.
ఈ గనిలోపల వివిధ పొరల్లో(సీమ్స్)ని బొగ్గును పిల్లర్లు ఏర్పాటు చేస్తూ వెలికితీశారు. 3వ సీమ్‌లో 182 పిల్లర్ల పరిధిలో భూమిపైనుంచి సుమారుగా 30 మీటర్ల లోతులోనే బొగ్గు వెలికితీశారు. ఈ ప్రాంతంలో తిలక్‌నగర్, విఠల్‌నగర్, 7బీ కాలనీ, రమేశ్‌నగర్, చంద్రశేఖర్‌నగర్ కాలనీలున్నాయి. వీటిల్లో వేలాది మంది నివసిస్తున్నారు. కాగా ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్, రైల్వే ట్రాక్‌లు ఉన్న ప్రాంతాల్లో బూడిద నింపి స్టోవింగ్ చేస్తుండగా, నివాస ప్రాంతాలున్న వైపు మాత్రం గోడలు నిర్మించి వదిలేస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఈ గనిని కోల్ టూరిజం కింద గుర్తించారు. 2022 డిసెంబర్లో మొదలైన కోల్ టూరిజం రెండు నెలలు కొనసాగించి ఆ తర్వాత బంద్ చేశారు.
విషవాయువుల ముప్పు
జీడీకే 7 ఎల్‌ఈపీ గనిలో బొగ్గు వెలికితీసిన చోటును పూడ్చాల్సి ఉండగా ఖాళీగా వదిలేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో విషవాయువులు తయారవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గనికి సమీపంలోని ఆయా కాలనీల ప్రజలు వాటర్ కోసం బోర్ హోల్స్ వేస్తుండగా భూమిలో నుంచి గ్యాస్ వెలువడి ప్రమాదకరంగా మారుతోంది. దీనికితోడు 7 ఎల్‌ఈపీ గనికి రెండు వైపులా రెండు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌లున్నాయి.
వీటిల్లో మట్టి, బొగ్గు వెలికితీతకు ప్రతి రోజు భారీగా బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఈ బ్లాస్టింగ్‌లతో మైన్లోని పిల్లర్లు కుప్పకూలే అవకాశం ఉంది. దీనివల్ల కూడా గని ఉపరితలంలోని భూమి కుంగిపోయే ప్రమాదం ఉంది. అలాగే గనిలో నిర్మించిన గోడలకు పగుళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. దీంతో బయటి నుంచి గాలి లోపలికి వెళ్లి గ్యాలరీల్లోని బొగ్గు మండే చాన్స్ ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఖాళీలను పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలి
సింగరేణి జీడీకే 7 ఎల్‌ఈపీ మైన్‌లో బొగ్గు తీసిన చోట ఇసుక లేక బూడిద నింపకపోవడంపై ఇప్పటికే ఆఫీసర్లకు వినతిపత్రాలు అందజేశాం. గని ఉపరితలంపై ఉన్న కాలనీల ప్రజలకు ఫ్యూచర్‌లో ఇబ్బందులు తలెత్తకుండా స్టోవింగ్ చేసేలా మేనేజ్‌మెంట్ చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో సింగరేణి సీఎండీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ(డీజీఎంఎస్) ఆఫీసర్లు జోక్యం చేసుకోవాలి.
- పాముకుంట్ల భాస్కర్, కార్పొరేటర్