- గతంలో 6.6 శాతమే.. ప్రకటించిన ప్రపంచ బ్యాంకు
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంకు మంగళవారం భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6.6 శాతం నుంచి 7 శాతానికి పెంచింది. వ్యవసాయ రంగంలో రికవరీ, గ్రామీణ డిమాండ్ పుంజుకోవడం ఇందుకు కారణాలని పేర్కొంది. ఇది అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) అంచనాలకు అనుగుణంగా ఉంది. ఈ రెండు ఏజెన్సీలు రెండూ మార్చి 2025తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి తమ అంచనాను 7 శాతానికి పెంచాయి. 2024-–25లో దేశ వాస్తవ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 6.5-7 శాతానికి పెరుగుతుందని ఆర్థిక సర్వే పేర్కొంది.
అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 7.2 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. ప్రపంచ బ్యాంక్ జూన్‌లో విడుదల చేసిన అంచనాల ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 6.6 శాతం ఉంది. ఇది మునుపటి అంచనాల నుంచి జీడీపీ అంచనాను 40 బేసిస్ పాయింట్లు పెంచింది. రుతుపవనాల మెరుగుదల, ప్రైవేట్ వినియోగం, ఎగుమతులు పెరగడం వల్ల జీడీపీ అంచనాలను సవరించామని ప్రపంచ బ్యాంక్ సీనియర్ ఆర్థికవేత్త రాన్ లీ చెప్పారు. దక్షిణాసియా ప్రాంతంలో అత్యధికంగా ఉన్న భారతదేశ వృద్ధి రేటు 2024-–25లో ఏడు శాతంగా ఉంటుందని ఇండియా డెవలప్‌మెంట్ అప్‌డేట్‌లో ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది.
భవిష్యత్ భేష్
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సవాళ్లు ఉన్నప్పటికీ ఇండియా మధ్యకాలిక దృక్పథం సానుకూలంగా ఉంటుందని ప్రపంచబ్యాంకు పేర్కొంది. 206,2027లోనూ బలంగా ఉంటుందని తెలిపింది. బలమైన రాబడి వృద్ధి, మరింత ఫిస్కల్ కన్సాలిడేషన్వల్ల, డెట్ టూ జీడీపీ నిష్పత్తి 2024 ఆర్థిక సంవత్సరంలో 83.9 శాతం నుంచి 2027 ఆర్థిక సంవత్సరం నాటికి 82 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. 2027 ఆర్థిక సంవత్సరం వరకు కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 1-1.6 శాతంగా ఉంటుందని లెక్కగట్టింది. భారతదేశానికి బలమైన వృద్ధి అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గుతోందని, తీవ్ర పేదరికాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని ప్రపంచ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ అగస్టే టానో కౌమే అన్నారు.
భారతదేశం తన ప్రపంచ వాణిజ్య సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా దాని వృద్ధిని మరింత పెంచుకోవచ్చు. ఐటీ, వ్యాపార సేవలు, ఫార్మా, టెక్స్‌టైల్స్, దుస్తులు పాదరక్షల రంగాలలో ఎగుమతులు పెరిగాయి”అని అన్నారు. 2030 నాటికి ట్రిలియన్ డాలర్ల సరుకుల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకోవడానికి, భారతదేశం తన మరిన్ని సరుకులను, వస్తువులను విదేశాలకు అమ్మాలని సూచించింది.