‘ఛావా’ సినిమా తెలుగులో రిలీజ్.. గీతా ఆర్ట్స్ రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసింది

‘ఛావా’ సినిమా తెలుగులో రిలీజ్.. గీతా ఆర్ట్స్ రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసింది

ఫిబ్రవరీ 14 న రిలీజై.. వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది ‘ఛావా’ సినిమా. మరాఠా యోధుడు శంభాజీ మహరాజ్ చరిత్ర ఆధారంగా వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.500 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. విక్కీ కౌశల్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాస్ వసూల్ చేసిన సినిమాగా నిలిచిపోయింది. ఆడియెన్స్ నుంచి వస్తున్న అద్భుత రెస్పాన్స్ తో మూవీ సక్సెస్ ఫుల్ గా బాక్సాఫీస్ షేక్ చేస్తోంది. 

అయితే శివాజీ మహరాజ్ తనయుడు శంభాజీ మహరాజ్ జీవిత కథాంశంతో వచ్చిన సినిమా కావడంతో ఇండియన్ ఆడియన్స్ లో ఒకరకంగా పూనకాలు తెచ్చిందనే చెప్పవచ్చు. మరాఠా హిస్టరీ మీద ఆసక్తి ఉన్న చాలా మంది ఈ సినిమాను ఇప్పటికే చూసేశారు . తెలుగులో లేకపోవడంతో చూడలేకపోతున్నామని సోషల్ మీడియాలో ఛావా ఫ్యాన్స్ వాపోతున్నారు. 

ఆడియన్స్ ఇంట్రెస్ట్ ను గమనించి.. సినిమాకు ఉన్న క్రేజ్.. కలెక్షన్లను దృష్టిలో ఉంచుకుని తెలుగులో రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్. వాస్తవానికి సినిమాను తెలుగులో ఓటీటీలో రిలీజ్ చేద్దామనుకున్నారట. కానీ బాక్సాఫీస్ వద్ద రోజు రోజుకు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ మూవీని.. తెలుగులో డైరెక్ట్ గా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. 

అందుకు సంబంధించిన డబ్బింగ్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. మార్చి 7న తెలుగు వర్షన్ ను థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు గీతా ఆర్ట్స్ ప్రకటించింది. ఆ వారంలో పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడంతో తెలుగు బాక్సాఫీస్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తు్న్నాయి.