
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: ‘యశస్వినీ ఆల్ ఉమెన్ మోటార్‌సైకిల్ ఎక్స్‌పెడిషన్- 2023’ పేరిట సీఆర్పీఎఫ్ మహిళా అధికారులు నిర్వహిస్తున్న రైడర్ ట్రూప్‌కు గీతం డీమ్డ్ యూనివర్శిటీ బుధవారం గ్రాండ్ వెల్కమ్ పలికింది. సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ సుమ నేతృత్వంలో 60 మంది సభ్యుల బృందం కన్యాకుమారి నుంచి బైక్ యాత్ర ఆరంభించి గుజరాత్‌లోని ఏక్తానగర్‌కు చేరుకోనున్నారు.
ఏకకాలంలో శ్రీనగర్, షిల్లాంగ్, కన్యకుమారి నుంచి అక్టోబర్ 5న ప్రారంభమైన మూడు బృందాలు 15 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల గుండా దాదాపు 15 వేల కిలోమీటర్లు ప్రయాణించి నెలాఖరుకు ఏక్తానగర్ చేరుకోనున్నాయి. మార్గ మధ్యలో కన్యాకుమారి ట్రూప్‌ను బుధవారం గీతం ఆధ్వర్యంలో స్వాగతించి ఆతిథ్యం అందించారు.
జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, సీఆర్పీఎఫ్ డీఐజీ అనిల్ మింజ్, కమాండెంట్ ఉత్పల్ మోని బెశ్యై, అసిస్టెంట్ కమాండెంట్ కిషోర్, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ బైక్ రైడర్లకు స్వాగతం పలికారు.‘ బేటీ బచావో- బేటీ పడావో’, ‘నారీ శక్తి’ సందేశాలను వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో ఈ యాత్రను చేపట్టినట్లు మహిళా రైడర్లు తెలిపారు.