ధర్మసాగర్, వెలుగు: ఇరువురి మధ్య డబ్బుల గొడవ బాంబులు పేల్చే వరకు దారి తీసింది. ఇసుక పోయించుకుని డబ్బులు ఇవ్వడం లేదంటూ ఓ వ్యక్తి ఏకంగా హోటల్ లో జిలెటిన్ స్టిక్స్ పేల్చాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో బుధవారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో ఒకరిపై ఒకరు ఇచ్చుకున్న ఫిర్యాదు మేరకు ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మసాగర్ మండల కేంద్రంలో యాట జనార్దన్ హోటల్ నడుపుతున్నాడు. కొద్ది రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన ఇసుక వ్యాపారి దారంగుల శ్రీను దగ్గర జనార్దన్ ట్రాక్టర్ ఇసుక పోయించుకున్నాడు.
నాలుగు రోజుల్లో డబ్బులు ఇస్తానని చెప్పి సమయానికి ఇవ్వలేకపోయాడు. దీంతో శ్రీను, అతని బావమరిది వల్లపు రాజు బుధవారం సాయంత్రం జనార్ధన్ హోటల్ కు వెళ్లి డబ్బులు అడిగారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిన శ్రీను.. తన బంధువులైన వల్లపు మధు, ప్రశాంత్, రమేశ్, రఘు, బన్నీని జనార్దన్ హోటల్ కు తీసుకెళ్లాడు. శ్రీనుకు డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదంటూ వారంతా జనార్ధన్‌తో గొడవకు దిగారు. అప్పటికే తమ వెంట తెచ్చుకున్న జిలెటిన్ స్టిక్స్ కు నిప్పంటించి హోటల్లో విసిరారు.
అది భారీ శబ్దంతో పేలడంతో అక్కడున్న సామగ్రి ధ్వంసం అయ్యింది. జనార్ధన్ తో పాటు ఆయన భార్య, పిల్లలు భయభ్రాంతులకు గురయ్యారు. శ్రీను, అతని బంధువుల తనను చంపాలని చూశారని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులకు జనార్దన్ ఫిర్యాదు చేశాడు. కాగా, డబ్బులు అడగడానికి వెళ్తే జనార్దన్ తో పాటు అతని సోదరులు యాట రాజు, సన్నీ, సాయి తనపై దాడి చేశారని శ్రీను కూడా కంప్లైంట్ చేశాడు. ఇద్దరి ఫిర్యాదులు స్వీకరించి కేసు నమోదు చేశామని ధర్మసాగర్ సీఐ శ్రీధర్ రావు తెలిపారు.