ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్‌‌.. బయటపడ్డ జిలెటిన్‌‌ స్టిక్స్‌‌

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్‌‌..  బయటపడ్డ జిలెటిన్‌‌ స్టిక్స్‌‌
  •     కరీంనగర్‌‌ జిల్లాలో ఘటన

గంగాధర, వెలుగు : ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో అక్రమంగా తరలిస్తున్న జిలెటిన్‌‌ స్టిక్స్‌‌ బయటపడ్డాయి. ఈ ఘటన కరీంనగర్‌‌ జిల్లా గంగాధర మండలం మధురానగర్‌‌ శివారులో హైవేపై గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మధురానగర్‌‌ శివారులో కరీంనగర్‌‌ – జగిత్యాల హైవేపై గురువారం ఉదయం ఓ ఆటోను ఆర్టీసీ బస్సు ఎదురుగా ఢీకొట్టడంతో ఆటో పల్టీ కొట్టింది. ఆటో డ్రైవర్‌‌ వెంటనే లేచి వెనుక సీట్లో ఉన్న రెండ్‌‌ బాక్స్‌‌లను పక్కనే ఉన్న కల్వర్టులో పడేశాడు. 

గమనించిన స్థానికులు ఆ బాక్స్‌‌లలో ఏముందని ఆటో డ్రైవర్‌‌ను ప్రశ్నించగా.. తనకేమీ తెలియదంటూ అక్కడి నుంచి పారిపోయాడు. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని బాక్స్‌‌లను పరిశీలించగా 400 జిలెటిన్‌‌ స్టిక్స్‌‌, వాటిని పేల్చేందుకు ఉపయోగించే కార్డెక్స్‌‌ వైర్‌‌ బండిల్‌‌ దొరికాయి. వీటిని జగిత్యాల జిల్లా వెల్గటూర్‌‌ నుంచి కరీంనగర్‌‌ జిల్లా గంగాధర వైపు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే ఆటోకు ముందు వైపున AP36-TB-5246 అనే నంబర్‌‌ ఉండగా.. మరోవైపు AP-36-W6231 అనే నంబర్‌‌ ఉంది. 

జిలెటిన్‌‌ స్టిక్స్‌‌ను ఆటోలో తరలించడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనలో మందుగుండు సామగ్రిని భారీగా సేకరించేందుకు పర్మిషన్‌‌ తీసుకున్న వారి ప్రమేయం ఉందా ? లేక స్టాక్‌‌ పాయింట్ల నుంచి డైరెక్ట్‌‌గా తరలిస్తున్నారా ? అనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఆటోను బస్సు ఢీకొన్న టైంలో ప్రమాదవశాత్తు జిలెటిన్‌‌ స్టిక్స్‌‌ పేలి ఉంటే భారీ స్థాయిలో నష్టం జరిగి ఉండేదని పోలీసులు భావిస్తున్నారు.