యాదాద్రి పవర్ ప్లాంట్ నుంచి చోరీ అయిన రూ.6 కోట్ల మెటీరియల్​ బీహెచ్ఈఎల్​దే

హైదరాబాద్, వెలుగు :  యాదాద్రి థర్మల్​ ప్లాంట్​ నుంచి చోరీకి గురైన రూ.6.05 కోట్ల మెటీరియల్​ బీహెచ్ఈఎల్​కు చెందినదని, ఇప్పటికే దీనిపై పోలీసు కేసు నమోదైందని జెన్​కో తెలిపింది. మెటీరియల్​ చోరీపై ‘వెలుగు’ దినపత్రికలో వచ్చిన వార్తపై జెన్​కో స్పందించింది. యాదాద్రి ప్రాజెక్ట్​  ఇంకా నిర్మాణ దశలోనే ఉందని, బీహెచ్ఈఎల్​  ఇప్పటి వరకు జెన్​కో కు ఎలాంటి మెటీరియల్​ హ్యాండోవర్​ చేయలేదని సంస్థ డైరెక్టర్​ వెల్లడించారు.

యాదాద్రి పవర్​ ప్లాంట్​ నిర్మాణం చేస్తున్న సంస్థ బీహెచ్ఈఎల్​  ఆధీనంలో ఉన్న రూ.98 వేల విలువైన బ్రాస్​  సీడబ్ల్యూపీ లైన్​ షాఫ్ట్​ బేరింగులు 2023 జులై 1న , రూ.2.49 కోట్ల విలువైన బ్రైడెడ్​  ఫిక్సబుల్​ కనెక్షన్​ మెటీరియల్​  అదే ఏడాది అక్టోబర్​ 31న,  రూ.2.81 కోట్ల విలువైన అల్యూమినియం రోల్స్  ఈ ఏడాది  ఫిబ్రవరి 27న ​,  మరో రూ.2.80 లక్షల విలువైన అల్యూమినియం రోల్స్, రూ.71లక్షల విలువైన జీఐ షీట్​ రోల్స్​ ఇలా మొత్తం రూ.6.05 కోట్ల విలువైన మెటీరియల్​ ఈనెల 29న చోరీకి గురైందని జెన్​కో వెల్లడించింది. దీనిపై బీహెచ్ఈఎల్..​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా కేసులు నమోదైయ్యాయని తెలిపింది. బీహెచ్ఈఎల్​ కస్టడీలో ఉన్న మెటీరియల్​  సదరు సంస్థకే చెందుతుంది తప్ప దానిపై జెన్​కోకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.