- ఆడో, మగో తేల్చేస్తున్నరు
- జమ్మికుంటలో స్కానింగ్ సెంటర్ సీజ్ తో తెరపైకి అబార్షన్ల వ్యవహారం
- ఉన్నతాధికారులు చెప్పేవరకూ గుర్తించని జిల్లా హెల్త్ ఆఫీసర్లు
- డాక్టర్లపై చర్యలు తీసుకోకుండా ఓ మంత్రి పైరవీ!
కరీంనగర్, వెలుగు: జిల్లాలోని స్కానింగ్ సెంటర్లు, హాస్పిటల్స్ లో లింగనిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు జరుగుతున్నాయి. పుట్టబోయేది ఆడో, మగో ముందే తెలుసుకుని.. ఆడ శిశువు అని తేలితే అబార్షన్లు చేసేస్తున్నారు. రూ.10 వేలు ఇస్తే లింగనిర్ధారణ చేయడం, మరో రూ.30 వేలు ఇస్తే అబార్షన్ చేయడాన్ని ఓ స్కీమ్ లా నడిపిస్తున్నారు. ఇటీవల జమ్మికుంట పట్టణంలోని శ్రీ విజయసాయి హాస్పిటల్ లో లింగ నిర్ధారణ, అబార్షన్ వ్యవహారం వెలుగు చూడడంతో జిల్లాలోని స్కానింగ్ సెంటర్లలో జరుగుతున్న ఇల్లీగల్ దందా తెరపైకి వచ్చింది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. కరీంనగర్ జిల్లాలో ఆరేళ్లలోపు చిన్నారుల్లో లింగ నిష్పత్తి 931(ప్రతి వెయ్యి మంది మగ పిల్లలకు)గా నమోదైంది. గడిచిన 12 ఏళ్లలో హాస్పిటల్స్ లో జరుగుతున్న డెలీవరీలు, పుట్టిన పిల్లల లింగ నిష్పత్తిని పరిశీలిస్తే పరిస్థితిలో మార్పు లేదు. అమ్మాయిల సంఖ్య ఏటేటా తగ్గడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
గుర్తించని హెల్త్ ఆఫీసర్లు..
జిల్లాలోని వివిధ హాస్పిటల్స్ లో 107 స్కానింగ్ సెంటర్లు నిర్వహిస్తుండగా.. వీటిలో జమ్మికుంటకు చెందినవి సుమారు 10 వరకు ఉన్నాయి. గతంలో నాలుగేళ్ల క్రితం జమ్మికుంటలో లింగనిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఓ హాస్పిటల్ ను మూసివేశారు. తాజాగా ఇదే పట్టణంలోని శ్రీవిజయసాయి హాస్పిటల్ లో నిర్వహిస్తున్న స్కానింగ్ దందాపై ఏకంగా సీఎంఓ ఆఫీసుకు సమాచారం వెళ్లినట్లు తెలిసింది. సీఎంఓ ఆదేశాలతో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డైరెక్షన్ లో ఈ నెల 15న డీఎంహెచ్ వో లలితాదేవి మూడు టీమ్ లతో కలిసి జమ్మికుంట హాస్పిటల్స్ లో సడెన్ విజిట్స్ చేయగా.. శ్రీవిజయసాయి హాస్పిటల్ లో జరుగుతున్న అబార్షన్ వ్యహారం వెలుగు చూసింది. ఉన్నతాధికారులు చెప్పేవరకూ జిల్లా హెల్త్ ఆఫీసర్లు గుర్తించకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది. లింగనిర్ధారణ పరీక్షలు కేవలం శ్రీవిజయసాయి హాస్పిటల్ కే పరిమితం కాదని, జమ్మికుంటతోపాటు జిల్లావ్యాప్తంగా అనేక స్కానింగ్ సెంటర్లలో ఈ తరహా దందా నడుస్తుందనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. స్కానింగ్ సెంటర్లపై ఎలాంటి నిఘా లేకపోవడం వల్లే వారి దందా ఆర్ఎంపీలు, ఇతర మధ్యవర్తుల సహకారంతో యథేచ్చగా సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
డాక్టర్లపై చర్యలు తీసుకోకుండా ఓ మంత్రి పైరవీ ?
శ్రీవిజయసాయి హాస్పిటల్ లో జరుగుతున్న లింగనిర్ధారణ పరీక్షలు, అబార్షన్ల దందాపై జిల్లా ఆఫీసర్లకు సమాచారమిస్తే ఎలాంటి చర్య తీసుకోరనే ఉద్దేశంతోనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఆకస్మిక తనిఖీలు జరిగాయి. మొదటి సంతానం కుమార్తె అని, రెండోసారి గర్భందాల్చాక స్కానింగ్ ద్వారా ఆడ శిశువు అని గుర్తించి అబార్షన్ చేయించుకున్నట్లు స్వయంగా అబార్షన్ జరిగిన మహిళ చెప్పడంతో డీఎంహెచ్ఓ సిఫార్సు తో పోలీసులు కేసు ఫైల్ చేశారు. హాస్పిటల్ సీజ్ చేశారు. అయితే ఇంత పకడ్బందీగా చేసిన ఈ కేసు నుంచి డాక్టర్లను బయటపడేసేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి హెల్త్ ఆఫీసర్లపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిసింది. అయితే విషయం సీఎం ఆఫీసు వరకు వెళ్లిందని చెప్పడంతో వెనక్కి తగ్గినట్లు సమాచారం.
ముఖ్బీర్ యోజన తరహా స్కీమ్ తో మేలు..
లింగనిర్ధారణ పరీక్షలు, అబార్షన్లను నిరోధించేందుకు, స్కానింగ్ సెంటర్ల గుట్టురట్టు చేసేందుకు ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోటస్టిక్ టెక్నిక్స్ యాక్ట్(పీసీపీఎన్డీటీ) అమలులో భాగంగా రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో 'ముఖ్బీర్ యోజన(ఇన్ ఫార్మర్ స్కీమ్)' పేరిట ఓ స్కీమ్ ను అక్కడి ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. గర్భిణీ, ఆమె భర్త కలిసి డెకాయి ఆపరేషన్ ద్వారా స్కానింగ్ సెంటర్లలో జరిగే అక్రమాలను వెలుగులోకి తీసుకురావాల్సి ఉంటుంది. ఇలా పట్టించినవారికి రూ.3 లక్షలను మూడు విడతల్లో చెల్లిస్తుంది. మన రాష్ట్రంలోనూ ఇలాంటి స్కీమ్ ను తీసుకురావాలని నాలుగేళ్ల క్రితమే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టినా ఇప్పటి వరకు ఆమోదం పొందలేదు.