
- ఆర్ఎంపీ, పీఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే అందించాలి
- కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, వెలుగు: లింగ నిర్ధారణ పరీక్ష చేయడం చట్టరీత్యా నేరమని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. లింగ నిర్ధారణ నిషేధ చట్టం, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టుపై మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి అర్పిత మారంరెడ్డి, అడిషనల్ కలెక్టర్ మోతీలాల్, డీఎంహెచ్వో డాక్టర్ హరీశ్ రాజ్ తో కలిసి జిల్లాస్థాయి సమావేశం నిర్వహిం చారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రుల్లో పుట్టబోయేది ఆడబిడ్డ, మగబిడ్డ అని తెలియజేయొద్దని, లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారికి, చేయించుకున్న వారికి, ప్రోత్సహించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, జైలుకు పంపుతామని హెచ్చరించారు.
ఆర్ఎంపీలు, పీఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే అందించాలని.. ఆయుర్వేద వైద్యులు అల్లోపతి వైద్యం చేయకూడదని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో తగ్గిన బాలికల నిష్పత్తిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ‘బ్రూణ హత్యలు ఆపేద్దాం.. ఆడపిల్లలను రక్షించుకుందాం’ అనే నినాదంతో ప్రజలలో అవగాహన కల్పిస్తామన్నారు. సంబంధిత వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ ఎ.ప్రసాద్, డాక్టర్ కృపాబాయి, మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు, ఎస్ వో కాంతారావు, డాక్టర్ రాధిక, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రమణ పాల్గొన్నారు.