విశ్లేషణ: ఆడవాళ్లకు ఇంకెన్నాళ్లీ సంకెళ్లు?

ఆడామగా సమానమే.. కానీ మగవాళ్లు కాస్త ఎక్కువ సమానం. ఇది పాత తెలుగు సినిమాలోని ఓ డైలాగ్. ప్రస్తుతం పరిస్థితులు కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేవు. ఏటికేడాది జెండర్​ ఈక్వాలిటీ ఇండెక్స్​లో మనదేశం ర్యాంకు తగ్గిపోతోంది. మొత్తం 156 దేశాల్లో ఇండియా 140వ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో మహిళా అభివృద్ధి, సమానత్వం అనేవి ఉత్త మాటలుగానే మిగులుతున్నాయి. కట్టుబాట్లు, సంప్రదాయాల పేరిట నేటి మహిళలు ఇంకా పురుషాధిక్య సంకెళ్లకే పరిమితమైపోతున్నారు. అస్థిత్వం, ఆత్మగౌరవం కోసం ఎన్నో పోరాటాలు చేస్తున్నా.. మహిళా సమానత్వం సాకారమయ్యేదెప్పుడు? వారికి పూర్తి స్వేచ్ఛ లభించేదెప్పుడు? 

75 ఏండ్లు గడుస్తున్నా..
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా.. నేటికీ మహిళలకు మాత్రం స్వేచ్ఛ లభించలేదు. ఇప్పటికీ వారిని వంటింటి కుందేలుగా, పిల్లల్ని కనే యంత్రాలుగానే మగవాళ్లు చూస్తున్నారు. అమ్మను భరతమాతగా, చదువును సరస్వతిగా, మహిళలను ఆదిపరాశక్తిగా, త్యాగశీలిగా రాతల్లో మోతలేగాని, వారి బానిస సంకెళ్లు మాత్రం ఇంకా తెగడం లేదు. మహిళాభివృద్ధి, స్త్రీ-పురుష సమానతల్లో అంతరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. మహిళా అభివృద్ధి, సమానత్వమే సామాజిక ప్రగతికి ప్రామాణికంగా భావించాలన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్. కానీ, ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ వాస్తవ రూపం దాల్చలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వివిధ రంగాల్లో మహిళలు గణనీయంగా ముందడుగు వేసినట్లు పాలకులు చెబుతున్నారు. అయితే స్త్రీ-పురుష సమానత్వం, పితృస్వామ్య భావజాల ఆధిపత్యంలో నుంచి వారికి సంపూర్ణ స్వేచ్ఛ లభించనే లేదన్నది చేదు నిజం. ఆర్థిక కార్యకలాపాల్లో, రాజకీయ సాధికారతలో, ఉపాధి అవకాశాల్లో, విద్య, వైద్యంలో కూడా సరైన భాగస్వామ్యం కల్పించకపోవడం లాంటి కారణాల వల్ల స్త్రీ-పురుష సమానత్వం, అభివృద్ధి సూచీలో మన దేశం ర్యాంకు పడిపోయింది.

అంతరాలు పెరుగుతున్నయ్
సమానత్వానికి సంబంధించి ఆడామగా మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయని వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) రూపొందించిన గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్- 2021 వెల్లడించింది. మొత్తం 156 దేశాల్లో అధ్యయనం చేసిన మహిళా సమానత్వ సూచిలో ఇండియా140వ స్థానంలో నిలిచింది. గతేడాది కంటే ఈసారి 28 స్థానాలు దిగువకు పడిపోయింది. మహిళా సమానత్వంలో అంతరాలు నేటికీ పెరుగుతుండటం ఆందోళనను పెంచుతోంది. ప్రజాస్వామ్య దేశంలో కూడా మహిళలకు రాజకీయంగా సరైన ప్రాతినిధ్యం లభించడం లేదు. మహిళా ప్రజా ప్రతినిధులు, మంత్రుల సంఖ్య తగ్గుతోంది. 2021లో వృత్తి నైపుణ్యం, సాంకేతిక రంగాల్లో మహిళల పాత్ర 29.2 శాతానికి తగ్గింది. కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యం 24.8 శాతం నుంచి 22.3 శాతానికి పడిపోయింది. సీనియర్, మేనేజ్ మెంట్ స్థాయి పదవుల్లో వీరి భాగస్వామ్యం 14.6 శాతమే. అత్యున్నత స్థాయి మేనేజర్లలో మహిళలు 8.9 శాతం మాత్రమే ఉన్నారు.

సమానత్వంలో ఐర్లాండ్ టాప్
మగవారి సంపాదనతో పోల్చితే మహిళల సంపాదన ఐదో వంతు మాత్రమేనని.. ఈ విభాగంలో అట్టడుగున ఉన్న పది దేశాల్లో ఇండియా ఒకటని ఈ నివేదిక పేర్కొంది. ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు తమకు బాగా తెలిసిన వ్యక్తులు, కుటుంబ సభ్యుల నుంచే హింస, వేధింపులకు గురవుతున్నారు. ప్రపంచంలో ఆడామగా సమానత్వం విషయంలో వరుసగా 12వ సారి ఐర్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, రువాండా, స్వీడన్, స్విట్జర్లాండ్ కొనసాగుతున్నాయి. జెండర్  పరమైన కారణంగా గడిచిన అర్థ శతాబ్దంలో ఇండియాలో 4.5 కోట్ల మంది ఆడ శిశువులను చంపారన్న సత్యాన్ని యునైటెడ్ నేషన్స్ గతంలో వెల్లడించింది. దీని ఫలితంగానే మన దేశంలో జెండర్ నిష్పత్తి ప్రతి వెయ్యి మంది పురుషులకు ఉండే మహిళల సంఖ్య తగ్గుతూ వస్తోంది.

న్యాయ రంగంలోనూ అన్యాయమే
ఇక ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ క్షేమంగా తిరిగి ఇంటికి చేరే వరకు వారి కుటుంబం బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగించాల్సిన పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రతి రోజు దేశంలో మహిళలపై ఎన్నో దారుణాలకు పాల్పడుతున్న తీరు విస్మయాన్ని కలిగిస్తోంది. అర్థరాత్రి మగువ నిర్భయంగా నడిస్తేనే స్వాతంత్ర్యం అన్న బాపూజీ.. మాటలు 75 ఏండ్ల స్వాతంత్ర్య భారతంలో కూడా నెరవేరలేదన్నది కాదనలేని వాస్తవం. మరోవైపు పురుషాధిక్యత న్యాయ రంగంలోనూ కొనసాగుతోంది. దేశంలో 17 లక్షల మంది లాయర్లు ఉండగా, వారిలో మహిళల వాటా 15 శాతమే. దేశంలోని కింది కోర్టుల్లో సగటున 30 శాతం మంది మాత్రమే మహిళా జడ్జీలు ఉన్నారు. హైకోర్టుల్లో ఇది 11.5 శాతంగా మాత్రమే ఉంది. కోర్టుల్లో మహిళా ప్రాతినిధ్యం 50 శాతం కంటే ఎక్కువగా ఉండాలన్న డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. అయితే అది ఆచరణకు నోచుకోవడం లేదు. 

మహిళలు అభివృద్ధి సాధించాలంటే..
దేశవ్యాప్తంగా 20, 24 ఏండ్ల యువతుల్లో ప్రతి నలుగురిలో ఒకరు బాల్య వివాహాల బారిన పడుతున్నట్లు ప్రభుత్వ లెక్కల ద్వారా తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్, బీహార్, త్రిపుర, జార్ఖండ్, అస్సాం, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఈ పద్ధతి ఇంకా కొనసాగుతోంది. బాల్య వివాహాలకు ప్రధాన కారణం పేదరికమే. ఆడామగా సమానత్వానికి, మహిళా అభివృద్ధికి బాటలు వేయాలంటే ముందుగా మూలాలకు మందు వేయాలి. దుర్భర దారిద్ర్యంతో అల్లాడుతున్న కోట్లాది కుటుంబాల స్థితి గతులను మార్చేలా, సామాజిక ప్రగతికి తోడ్పడే విధాన నిర్ణయాలు తీసుకోవాలి. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నంత మాత్రాన వెంటనే సమస్య పరిష్కారం కాదు. మహిళ అభివృద్ధి కోసం నిధులు కేటాయించి, వారి హక్కులను చిత్తశుద్ధితో అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలి. దేశవ్యాప్తంగా స్కూల్ ఎడ్యుకేషన్​కు కూడా నోచుకోని బాలికలు 59 శాతం మంది ఉన్నారని సర్కారీ సర్వేలో చెబుతున్నాయి. అలాగే 15 ఏండ్లలోపు బాలికలు, 45 ఏండ్లలోపు మహిళల్లో 56 శాతానికి పైగా రక్తహీనతతో బాధపడుతున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. బాల్య వివాహాలు, ఆ తర్వాత గర్భదారణ వల్ల వీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందువల్ల బాలికల ఆరోగ్యం, చదువు విషయంలో గుణాత్మక మార్పు రావాలి. బడులు, కాలేజీలు, నైపుణ్య శిక్షణలు విరివిగా పెంచి సంపూర్ణ మహిళా విద్య, ఉపాధి, శ్రామిక శక్తిలోనూ వాటా పెరిగేలా చూడాలి. మహిళల హక్కుల రక్షణ కోసం ప్రజల్లో అవగాహన, చైతన్యం పెంచి సమానత్వ భావన నెలకొల్పాలి. అప్పుడే మహిళలు సర్వతోముఖాభివృద్ధి సాధించగలుగుతారు. ఆ దిశగా పాలకులు ఇప్పటికైనా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.

సమాజంలోనూ మార్పు రావాలె
మనదేశంలో ప్రజాస్వామ్య పాలన నడుస్తున్నా నేటికీ ఇంకా బాలికా విద్య, మహిళా సమానత్వం, సాధికారత, అభివృద్ధి, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు అందని ద్రాక్షలాగా మారాయి. నాటికి నేటికి అక్షరాస్యత పెరిగి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచమే కుగ్రామంగా మారినప్పటికీ మహిళలపై ఇంకా వివక్షత కొనసాగుతోంది. ఆడపిల్ల చదువంటే పెరట్లో చెట్టుకు నీళ్లు పోసినట్టుగానే ఇంకా చాలా మంది భావిస్తున్నారు. ఇప్పటికైనా మహిళలు అన్ని రంగాల్లో సమానత్వం సాధించేలా ప్రత్యేకంగా నిధులు కేటాయించి, సమాజంలో చైతన్యం కలిగించాలి. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా ప్రోత్సహిస్తూ వారికి సురక్షిత వాతావరణాన్ని కల్పించాల్సిన కనీస బాధ్యతను పాలకులు విస్మరించరాదు. చట్టాలు చేసినంత మాత్రాన మార్పు రాదు. సమాజంలో కూడా మార్పు వచ్చేలా ప్రత్యేక చర్యలు, కార్యక్రమాలు చేపట్టాలి. మహిళలకు గౌరవం పెంచేలా సమాజాన్ని చైతన్య పరచాలి. 

- మేకిరి దామోదర్, సోషల్​ ఎనలిస్ట్