పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జడ్పీ జనరల్ బాడీ మీటింగ్వాయిదా పడింది. మెజారిటీ జడ్పీటీసీలు హాజరుకాకపోవడంతో కోరం లేదని జడ్పీ సీఈవో శ్రీనివాస్ మీటింగ్‌ను వాయిదా వేశారు. బుధవారం జరగాల్సిన స్టాండింగ్కమిటీ సమావేశానికి ఇద్దరు సభ్యులే హాజరుకాగా.. గురువారం జడ్పీ మీటింగ్‌కు ఎవరూ హాజరుకాలేదు. దీంతో కొన్ని రోజులుగా పెద్దపల్లి జడ్పీలో విభేదాలు ఉన్నాయని, జడ్పీ చైర్మన్ పుట్ట మధుపై అవిశ్వాసం పెట్టేందుకు మెజారిటీ సభ్యులు రెడీ అయ్యారన్న ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది.
ఏ క్షణంలోనైనా జడ్పీ చైర్మన్‌పై అవిశ్వాస నోటీస్ అందించేందుకు సభ్యులు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. అసమ్మతి సభ్యులను బీఆర్ఎస్ హైకమాండ్ ఫోన్‌లో బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అయినా సభ్యులు రెండు రోజులుగా ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. చాలా మంది ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. దీంతో జడ్పీ చైర్మన్‌కు అవిశ్వాస గండం తప్పకపోవచ్చన్న చర్చ తీవ్రమైంది.