స్ట్రాంగ్ రూమ్ ​ఏర్పాట్లు పక్కాగా ఉండాలి

ఖమ్మం టౌన్, వెలుగు : స్ట్రాంగ్ రూమ్​ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చూడాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు డాక్టర్  సంజయ్ జి. కోల్టే, పోలీస్ పరిశీలకులు చరణ్ జిత్ సింగ్, ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని చైతన్య ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేస్తున్న లోక్ సభ సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ ల ఏర్పాట్లను  శుక్రవారం పరిశీలించారు. సీసీ కెమెరాలు, లైటింగ్, బ్యారికేడ్లు, పార్కింగ్, మీడియా సెంటర్ తదితర వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. ఒక్కో సెగ్నెంట్​కు ఒక్కో కలర్ కోడ్ పెట్టాలని, ఆ అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించిన ఫ్లెక్సీలు, ఈవీఎం రవాణా సిబ్బంది టీ షర్టులు అదే కలర్ లో ఉండాలని చెప్పారు.  

జనరేటర్ సదుపాయం ఉండాలని, అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని సూచించారు. లెక్కింపు ప్రక్రియ, భద్రతా చర్యల గురించి పలు సూచనలు చేశారు. వారి వెంట అడిషనల్​ కలెక్టర్లు బి. సత్యప్రసాద్, డి. మధుసూదన్ నాయక్, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, ట్రైనీ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, మిర్నల్ శ్రేష్ఠ, ట్రైనీ ఐపీఎస్ పి. మౌనిక, జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి, ఆర్డీవోలు గణేశ్, రాజేందర్, ఎస్ఈ ఆర్ అండ్ బీ శ్యామ్ ప్రసాద్, ఎస్ఈ ట్రాన్స్​కో సురేందర్, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, జిల్లా పౌరసరఫరాల అధికారిణి శ్రీలత, అధికారులు, తదితరులు ఉన్నారు.

రెండో దశ ర్యాండమైజేషన్ కంప్లీట్.. 

జిల్లాలో జరిగే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది రెండో దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్ వీపీ  గౌతమ్ తెలిపారు. శుక్రవారం న్యూ  కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్​లో పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్  సంజయ్ జి. కోల్టే తో కలిసి పోలింగ్ సిబ్బంది రెండవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు. జిల్లాలో మొత్తం 1459 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని , వీటికి ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారి, ఓపీవోలను కేటాయించనున్నట్లు చెప్పారు.  అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకుపారదర్శకంగా ఎన్ఐసీ సాఫ్ట్​వేర్​ వినియోగిస్తూ ఆన్​లైన్​లో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామని చెప్పారు. 

పటిష్ట చర్యలు చేపడుతున్నాం..

లోక్ సభ సాధారణ ఎన్నికలు సజావుగా జరిగేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. శుక్రవారం న్యూ కలెక్టరేట్ లో లోకసభ ఎన్నికల సాధారణ పరిశీలకుడు డాక్టర్. సంజయ్ జి. కోల్టే, పోలీస్ పరిశీలకుడు చరణ్ జీత్ సింగ్, వ్యయ పరిశీలకుడు అరుణ్ ప్రసాద్​ కృష్ణ సామి, శంకర ఆనంద్ మిశ్రా, సీపీ సునీల్ దత్, డీఎఫ్​వో సిద్దార్థ్ విక్రమ్ సింగ్ తో కలిసి విలేకరులతో ఇంటరాక్ట్ అయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 1,896 పోలింగ్ కేంద్రాలు, 1084 లోకేషన్లలో ఉన్నాయన్నారు. మొత్తం 16,31,039 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. గురువారం నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ ప్రారంభించినట్లు చెప్పారు. జిల్లాలో నిఘాకు 22 ఎఫ్ఎస్టీ, 21 ఎస్ఎస్టీ, 37 ఎంసీసీ టీమ్​లు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. 203 మంది సెక్టార్ అధికారులను నియమించినట్లు చెప్పారు. అన్నింటికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.