- రైళ్ల భద్రతపై చర్యలు తీసుకోండి
హైదరాబాద్,వెలుగు: వానాకాలం దృష్ట్యా రైలు వంతెనలు, ఆర్ యూబీ ప్రాంతాల్లో వాననీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్మేనేజర్ అరుణ్‌కుమార్‌జైన్ ఆదేశించారు. రైళ్లు సాఫీగా నడిచేలా సైడ్ వాటర్ డ్రెయిన్లు, నీటి కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రపరచడం, వాటి నిర్వహణ చర్యలు చేపట్టాలని సూచించారు. మంగళవారం సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో రైళ్ల భద్రతపై సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు చేపట్టేటప్పుడు భద్రతకు సంబందించిన అన్నీ జాగ్రత్తలు పాటించాలని అధికారులను ఆదేశించారు.
ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని స్పష్టంచేశారు. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్ , గుంటూరు, నాందేడ్ డివిజన్లకు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్‌లు (డీఆర్‌ఎంలు) వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. జనరల్ మేనేజర్ ఇంజనీరింగ్, సిగ్నల్ అండ్ టెలికం, ఎలక్ట్రికల్ మొదలైన వివిధ విభాగాలకు భద్రతా కార్యాచరణ ప్రణాళికలను సమీక్షించి పనుల పురోగతిపై సమీక్షించారు.
స్మార్ట్ వాటర్ పంపింగ్ సిస్టమ్ ప్రారంభం
రైల్‌నిలయం నుంచి గొర్రెల మండి వద్ద స్మార్ట్ వాటర్ పంపింగ్ సిస్టమ్‌ను వర్చువల్ గా ప్రారంభించారు. దీని ద్వారా 6 పంప్ హౌస్‌లకు (రైల్ నిలయం , సికింద్రాబాద్ , రైఫిల్ రేంజ్, అప్పర్ బోయిగూడ, హమాల్ బస్తీ , మెట్టుగూడ స్టాఫ్ క్వార్టర్స్) నీటిని సరఫరా చేస్తుంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాలకు నీటి పంపింగ్ మాన్యువల్‌గా జరుగుతోంది. స్మార్ట్ వాటర్ పంపింగ్ సిస్టమ్ రియల్ టైమ్ మానిటరింగ్ విధానంలో పనిచేస్తుంది లీకేజీల ద్వారా అయ్యే నీటి వృథాను తగ్గిస్తుంది. నీటి అక్రమాలను గుర్తిస్తుంది.