స్థలం ఇస్తే.. స్పోర్ట్స్​కాంప్లెక్స్​ నిర్మిస్తం

  • కంటోన్మెంట్​ ఎమ్మెల్యే శ్రీగణేశ్ ​రిక్వెస్ట్​
  • సర్వీస్ ​రోడ్లను 140 మీటర్లకు పరిమితం చేయాలి: ఎంపీ ఈటల

కంటోన్మెంట్, వెలుగు: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సెమినార్​హాల్​లో శనివారం సర్వసభ్య సమావేశం జరిగింది. బోర్డు అధ్యకుడు బ్రిగేడియర్ ప్రశాంత్​బాజ్​పాయ్, సీఈఓ మధుకర్​నాయక్​ ఏజెండా ప్రవేశపెట్టగా, ఎంపీఈటల రాజేందర్, ఎమ్మెల్యే శ్రీగణేశ్, బోర్డు నామినేటెడ్​ సభ్యుడు రామకృష్ణ పలు అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ.. రెండున్నరేళ్లుగా ఎన్నికలు లేకపోవడంతో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని, ప్రత్యేక అనుమతి తీసుకుని సికింద్రాబాద్​కంటోన్మెంట్​బోర్డుకు ఎన్నికలు నిర్వహించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని, కంటోన్మెంట్​ఏరియాలో స్పోర్ట్స్​కాంప్లెక్స్​నిర్మాణానికి స్థలం కేటాయిస్తే ప్రభుత్వం నుంచి నిధులు తెస్తానని చెప్పారు. 

ప్యారడైజ్ నుంచి శామీర్​పేట వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్​ కారిడార్​ ప్లాన్​ను హెచ్ఎండీఏ అధికారులు వివరించారు. ఎలివేటెడ్ కారిడార్ లో భాగంగా సర్వీస్​రోడ్లను 200 మీటర్ల వరకు విస్తరించాలని నిర్ణయించారని, స్థానికులు చాలా మంది నష్టపోతున్నారని, సర్వీస్​రోడ్ల విస్తరణను120 నుంచి 140 మీటర్లకు పరిమితం చేయాలని ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. భవిష్యత్​ను దృష్టిలో పెట్టుకుని సర్వీస్​రోడ్లను విస్తరిస్తున్నామని హెచ్ఎండీఏ అధికారులు వివరణ ఇచ్చారు. 

డిఫెన్స్, ప్రభుత్వ స్థలాలు ఉన్నచోట సర్వీస్​రోడ్లను 200 మీటర్ల వరకు విస్తరించాలని, అవసరమైతే వాహనాల పార్కింగ్​ఏర్పాటు చేయాలని, మిగిలిన ప్రాంతాల్లో 140 మీటర్లకు పరిమితం చేయాలని ఎంపీ ఈటల రాజేందర్​కోరారు. బోర్డు పరిధిలో ఎన్నో ఏండ్లుగా గుడిసెలు వేసుకుని ఉంటున్నవారికి పట్టాలు ఇవ్వాలని రిక్వెస్ట్​చేశారు. బిల్డింగ్ రెగ్యులరైజేషన్​ స్కీంలో నిబంధనలు సడలించాలన్నారు. నామినేటెడ్​సభ్యుడు రామకృష్ణ మాట్లాడుతూ బోర్డు పరిధిలోని లీజు భవనాల నుంచి ట్యాక్స్​వసూలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. స్థలాలను రక్షించాలన్నారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయడాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారన్నారు.