- ఐకేపీ ఏపీఎం లీలారాణికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్
- గుడిహత్నూర్ సర్వసభ్య సమావేశంలో సభ్యుల తీర్మానం
గుడిహత్నూర్, వెలుగు: ఆదిలాబాద్జిల్లా గుడిహత్నూర్ ఎంపీపీ నాగర్ గోజే భరత్ అధ్యక్షతన శుక్రవారం ఎంపీడీఓ ఆఫీసులో సర్వసభ్య సమావేశం జరిగింది. వివిధ శాఖల అధికారులు పాల్గొని చేసిన అభివృద్ధి పనులను వివరించారు.ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. ఈజీఎస్ ఏపీఓ సుభాషిణి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆమెను సరెండర్ చేయాలని సభ్యులు తీర్మానించారు.
ఉపాధి కూలీలకు పని కల్పించడంతోపాటు అనేక విషయాల్లో జవాబుదారీ తనం ఉండడం లేదని, దాటవేసే ధోరణితో వ్యవహరిస్తున్నారని చెప్పారు. వెంటనే ఆమెను సరెండర్ చేయాలని జడ్పీటీసీ పతంగే బ్రహ్మానంద్ సహా సభ్యులు కోరారు. అలాగే ఐకేపీలో గతంలో జరిగిన రుణాల అవకతవకల్లో నష్టపోయిన ఆయా గ్రూపు సభ్యులకు నేటికీ న్యాయం జరగలేదని, ఐకేపీ ఏపీఎంగా పనిచేస్తున్న లీలారాణి నిధుల దుర్వినియోగంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఇంకెన్నాళ్లు కాలయాపన చేస్తారని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆమెకు షోకాజ్ నోటీసులు పంపాలని డిమాండ్ చేశారు. మల్కాపూర్ గ్రామంలో మిషన్ భగీరథ నీరు ఇప్పటికీ అందడం లేదని జడ్పీటీసీ బ్రహ్మానంద్ సభ దృష్టికి తీసుకొచ్చారు. ఏఈ ఆదిత్య స్పందిస్తూ ఉన్నతాధికారులకు సమాచారం అందించామని చెప్పారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎవరూ సమయపాలన పాటించడం లేదని శాంతాపూర్ సర్పంచ్ తిరుమల్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పర్యవేక్షణ లోపంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందాల్సిన పౌష్టికాహారం అందడం లేదన్నారు. సమావేశంలో ఎంపీడీఓ బండి అరుణ, కో-ఆప్షన్ మెంబర్ షేక్ జమీర్, పీఏసీఎస్ చైర్మన్ సంజీవ్ ముండే, ఎంపీటీసీలు షగీర్, జ్ఞాను, అంకతి సవిత, కోవ తులసి వివిధ శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.