కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం హిమాచల్లో అన్ని విభాగాలు రద్దు

కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం హిమాచల్లో అన్ని విభాగాలు రద్దు

హిమాచల్ ప్రదేశ్ అధికార పార్టీ కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పార్టీ అన్ని విభాగాలను రద్దు చేసింది. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ బుధవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు నెలకొన్నాయి. పార్టీ నేతల తీరు వల్ల సొంత ప్రభుత్వం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో పార్టీని పూర్తిగా పునరుద్ధరించే ప్రణాళికలో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

హిమాచల్‌ ప్రదేశ్‌ పీసీసీ రాష్ట్ర యూనిట్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు, బ్లాక్‌ కాంగ్రెస్‌ కమిటీలతో సహా అన్ని హోదాలను రద్దు చేయాలన్న ప్రతిపాదనకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే ఆమోదం తెలిపినట్లు ప్రకటనలో ఉంది. పీసీసీ చీఫ్‌తోపాటు జిల్లా అధ్యక్షులు, బ్లాక్‌ కమిటీలను కూడా రద్దు చేశారు. మాజీ సీఎం వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ ప్రస్తుతం పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నారు. 2019లో కూడా హిమాచల్‌ప్రదేశ్‌లో అన్ని పార్టీ విభాగాలను కాంగ్రెస్‌ రద్దు చేసింది.